Punjab Governor Resigns :పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు పంపించారు. వ్యక్తిగత కారణాలతోపాటు ఇతర బాధ్యతలు ఉన్నందున పంజాబ్ గవర్నర్ పదవి సహా కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు బన్వరీలాల్ పురోహిత్ వెల్లడించారు.
శుక్రవారం దిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను బన్వరీలాల్ పురోహిత్ కలిశారు. ఆ మరుసటిరోజే రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జరిగిన చండీగఢ్ మేయర్, సీనియర్ డిప్యూటీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందింది. 2021 ఆగస్టు 31న భన్వరీలాల్ పురోహిత్ పంజాబ్ గవర్నర్‌గా, చండీగఢ్ అడ్మిస్ట్రేటర్‌గా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు తమిళనాడు, అసోం, మేఘాలయ రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేశారు.
గవర్నర్ వర్సెస్ సీఎం!
గత కొన్ని నెలలుగా గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్, రాష్ట్ర సీఎం భగవంత్ మాన్ల మధ్య వివిధ అంశాలపై మాటల యుద్ధం కొనసాగుతోంది. ఆమ్‌ఆద్మీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ప్రశ్నిస్తూ గవర్నర్, సీఎంకు పలుమార్లు లేఖలు రాశారు. గతేడాది ఆగస్టులో తన లేఖలకు సమధానం ఇవ్వకపోతే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తానని, క్రిమినల్ చర్యలు తీసుకుంటానని గవర్నర్ హెచ్చరించారు. ఆ తర్వాత ఇటీవలే కూడా తన లేఖలకు సీఎం నుంచి ఎటువంటి సమాధానం రాలేదని చెప్పారు. రాజ్యాంగ సూత్రాల దుర్వినియోగంపై రాష్ట్రపతికి నివేదిక పంపుతానని హెచ్చరించారు. ఆ తర్వాత అక్టోబర్లో భగవంత్ మాన్‌కు తరన్ తారన్ అక్రమ మైనింగ్ ఘటనపై లేఖ రాశారు గవర్నర్. పలు విషయాలను ఆ లేఖలో జోడించి వివరణాత్మక నివేదికను కోరారు.
మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులను పెండింగ్‌లో పెడుతున్నారంటూ అటు భగవంత్ మాన్ సర్కారు కూడా ఆరోపించింది. ఈ వ్యవహారం చివరకు సుప్రీంకోర్టుకు చేరింది. దీనిపై అత్యున్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తంచేసింది. ప్రభుత్వం, గవర్నర్‌ల మధ్య ప్రతిష్టంభన ఆందోళన కలిగించే అంశమని పేర్కొంది. బిల్లులకు ఆమోదం తెలపకపోవడంపై పంజాబ్ గవర్నర్‌ను ఉద్దేశిస్తూ 'మీరు నిప్పుతో ఆడుతున్నారు' అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించింది. ఈ పరిణామాల నేపథ్యంలో బన్వరీలాల్ రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.