Kharge Counter To Modi Parliament Speech : రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రసంగంపై కాంగ్రెస్ మండిపడింది. చరిత్రలో నివసించే వ్యక్తి వర్తమానం, భవిష్యత్తును ఎలా నిర్మించగలడని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. రాజ్యసభలో ప్రధాని ప్రసంగం అబద్ధాలు, అర్ధ సత్యాలతో నిండి ఉందని ఆరోపించారు.
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేతుల్లో దేశ భవిష్యత్తు అంధకారమని ఎక్స్‌లో ఖర్గే పోస్ట్ చేశారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఆర్థిక అసమానత, మాంద్యం, రూపాయి పతనం, ప్రైవేటు పెట్టుబడులు పడిపోవడం, విఫలమైన 'మేక్ ఇన్ ఇండియా' గురించి ప్రధాని మాట్లాడకుండా కాంగ్రెస్‌పై దూషణలను కొనసాగించారని పేర్కొన్నారు.
వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు ఇవ్వడానికిభూస్వామ్యాన్ని రద్దు చేయడానికి రాజ్యాంగానికి మొదటి సవరణను కాంగ్రెస్ చేసిందని ఖర్గే గుర్తు చేశారు. బాబాసాహెబ్ అంబేడ్కర్‌ను రాజ్యాంగ సభకు తీసుకురావడానికి కాంగ్రెస్ తమ సభ్యుడు ఎంఆర్ జయకర్‌ను ముంబయి నుంచి రాజీనామా చేయించిందని తెలిపారు.
నెహ్రూ ప్రభుత్వంలో అంబేడ్కర్ దేశానికి మొదటి న్యాయ మంత్రి అయ్యారని గుర్తు చేశారు. ఇందిరా గాంధీ 'గరీబీ హటావో' కార్యక్రమం పేదరికాన్ని తగ్గించిందని ఖర్గే చెప్పారు. యూపీఏ ప్రభుత్వం 27 కోట్ల మందిని దారిద్య్రరేఖ నుంచి బయటకు తీసుకువచ్చిందన్నారు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం కారణంగా ప్రజలు పొదుపు చేసుకోలేకపోతున్నారని రూపాయి అత్యంత బలహీన స్థాయిలో ఉందని ఖర్గే ఆరోపించారు.