President Republic Day Speech :అయోధ్య రామమందిరం భారత నాగరికత, వారసత్వాల పునరావిష్కరణగా చరిత్రలో గుర్తుండిపోతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. పాశ్చాత్య విధానాలతో పోలిస్తే భారత ప్రజాస్వామ్యం ఎంతో పురాతనమైందని పేర్కొన్నారు. అందుకే భారత్‌ను ప్రజాస్వామ్యానికి తల్లిగా పరిగణిస్తారని అభివర్ణించారు. ప్రస్తుతం దేశం అమృత కాల ప్రారంభ దశలో ఉందని, భారత్‌ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు పౌరులకు సువర్ణావకాశం ఇదేనని ఆశాభావం వ్యక్తం చేశారు. 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతినుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు.
'సంక్షేమం అనే ఆలోచనను కేంద్రం పునర్నిర్వచించింది'
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను రాష్ట్రపతి ముర్ము ప్రస్తావించారు. కేవలం సంక్షేమ కార్యక్రమాలను విస్తరించడమే కాకుండా సంక్షేమం అనే ఆలోచనను కేంద్రం పునర్నిర్వచించిందని అన్నారు. కొవిడ్ మహమ్మారి సమయంలో పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలను అందించిన ప్రభుత్వం, అనంతరం కూడా కొనసాగిస్తున్న విషయాన్ని రాష్ట్రపతి గుర్తుచేశారు. నూతన జాతీయ విద్యా విధానం, ఆయుష్మాన్ భారత్, మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంటు ఆమోదం, అంతరిక్ష ప్రయోగాల్లో సాధిస్తున్న ప్రగతి తదితర అంశాలను ఉటంకించారు.