Condolences To Manmohan Singh :భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ కన్నుమూశారు. గురువారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను దిల్లీలోని ఎయిమ్స్ అత్యవసరం విభాగంలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మన్మోహన్ సింగ్ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. దేశం గొప్పనేతను కోల్పోయిందని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
భరతమాత ముద్దు బిడ్డను కోల్పోయింది: రాష్ట్రపతి ముర్ము
"విద్య, పరిపాలనను సమానంగా విస్తరింపజేసిన అరుదైన రాజకీయ నాయకుల్లో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఒకరు. భారత ఆర్థిక వ్యవస్థను సంస్కరించడంలో కీలకపాత్ర పోషించారు. దేశానికి ఆయన చేసిన సేవ, ఆయన రాజకీయం జీవితం, వినయంతో కూడిన నడవడిక ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆయన మృతి దేశానికి తీరనిలోటు. భరతమాత ముద్దుబిడ్డల్లో ఒకరైన మన్మోహన్కు మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు సానుభూతి తెలియజేస్తున్నా"
దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చారు: ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్
"మన్మోహన్ సింగ్ ఇక లేరన్న విషయం చాలా బాధకు గురిచేసింది. ఆయన భారత దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చారు. ఆర్థిక సరళీకరణ రూప శిల్పిగా పేరు గడించారు. ఎంతో ధైర్యం ప్రదర్శించి కఠిన నిర్ణయాలతో దేశం ముందుకు సాగేలా చేశారు. దేశ అభివృద్ధికి ఎన్నో ద్వారాలు తెరిచారు. ఉప రాష్ట్రపతిగా ఆయనతో ఎన్నో సంభాషణలు జరిపాను. ఆర్థిక విధానం పట్ల ఆయనకున్న ప్రగాఢ విశ్వాసం, దేశ పురోగతి పట్ల అచంచల నిబద్ధత ఎప్పటికీ గుర్తుండిపోతాయి. భారత దేశం మహోన్నతమైన వ్యక్తిని కోల్పోయింది. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి"
భారత్ విశిష్ట వ్యక్తిని కోల్పోయింది: ప్రధాని మోదీ
"భారత దేశం విశిష్టమైన వ్యక్తుల్లో ఒకరైన మన్మోహన్ సింగ్ను కోల్పోయింది. ఎంతో నిరాడంబరంగా ఉండే ఆయన ఆర్థికవేత్తగా ఎదిగారు. ప్రధానిగానే కాకుండా ఆర్థిక మంత్రితో పాటు ఎన్నో ప్రభుత్వ విభాగాల్లో పనిచేశారు. దేశ ఆర్థిక విధానంపై ఎన్నో ఏళ్లుగా బలమైన ముద్రవేశారు. పార్లమెంట్లో ఆయన ప్రసంగాలు గొప్పగా ఉండేవి. ప్రధానిగా దేశ ప్రజల జీవితాలు మెరుగుపరిచేందుకు ఎంతో కృషి చేశారు. మన్మోహన్ ప్రధానిగా, నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తరుచూ మాట్లాడుకునేవాళ్లం. పాలనకు సంబంధించిన పలు అంశాలపై చర్చించేవాళ్లం. ఆయన జ్ఞానం, వినయం ఎల్లప్పుడూ ప్రస్ఫుటించేవి. ఈ సమయంలో నా ఆలోచనలన్నీ ఆయన కుటుంబం చుట్టూ తిరుగుతున్నాయి" అని మోదీ పేర్కొన్నారు.
దేశపాలనలో మన్మోహన్ సింగ్ పాత్ర కీలకం: అమిత్ షా
"మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇక లేరన్న వార్త చాలా బాధ కలిగించింది. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ నుంచి ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా దేశ పాలనలో కీలక పాత్ర పోషించారు ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఈ దుఃఖాన్ని భరించే శక్తిని ప్రసాదించాలని భగవంతుణ్ని వేడుకుంటున్నా"