Prajwal Revanna Suspension From JDS :లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ నేత, హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్నపై ఎట్టకేలకు సస్పెన్షన్ వేటు వేసేందుకు ఆ పార్టీ సిద్ధమైంది. జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి సోమవారం శివమొగ్గలో ఈ విషయం వెల్లడించారు. ఈ వ్యవహారంలోకి మిత్రపక్షం బీజేపీని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని లాగడం సరికాదని హితవు పలికారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి పోటీ చేస్తున్న ప్రజ్వల్ వ్యవహారంపై జేడీఎస్ మిత్రపక్షం బీజేపీ, మోదీ స్పందించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు కుమారస్వామి.
"నిర్ణయం ఇప్పటికే తీసుకున్నాం. మంగళవారం హుబ్లీలో జరిగే కోర్ కమిటీ సమావేశంలో ఈ విషయాన్ని(సస్పెన్షన్) ప్రతిపాదిస్తాం. ఆయన(ప్రజ్వల్) ఎంపీ. అందుకే దిల్లీ నుంచి చర్యలు తీసుకోవాలి. నిర్ణయం తీసుకోవాలని దేవెగౌడను కోరా." అని తెలిపారు కుమారస్వామి.
దర్యాప్తునకు సిద్ధం!
అంతకుముందు, లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తునకు సిద్ధమని మాజీ మంత్రి, జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్న స్పష్టం చేశారు. అభియోగాలు నిజమని తేలితే చట్టప్రకారం చర్యలు ఎదుర్కొంటామని తేల్చిచెప్పారు. "మేము ఇక్కడే ఉన్నాం. చట్టప్రకారం ఎదుర్కొంటాం. ఎప్పుడో 4-5 ఏళ్ల క్రితం విషయంపై ఇప్పుడు కేసు పెడుతున్నారు. దీనిపై నేను మాట్లాడను. కేసును సిట్‌కు అప్పగించారు. వారి దర్యాప్తునకు ఆటంకం కలగకూడదు" అని చెప్పారు రేవణ్న. కుమారుడితోపాటు తనపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై ప్రశ్నించగా, దీని వెనుక రాజకీయం ఉందని ఆరోపించారు. "వాళ్లు(కాంగ్రెస్ నేతలు) అధికారంలో ఉన్నారు. వారికి నచ్చినట్టు చేస్తారు" అని వ్యాఖ్యానించారు రేవణ్న.
సోదరి వరుసయ్యే మహిళపై లౌంగిక దౌర్జన్యం!
ప్రజ్వల్ రేవణ్న సెక్స్ కుంభకోణంలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎంపీ ప్రజ్వల్‌పై లైంగిక దౌర్జన్యం కింద కేసు నమోదు చేసిన మహిళ ఆయనకు బంధువు అని తెలుస్తోంది. వరసకు బాధిత మహిళ ప్రజ్వల్‌కు సోదరి అని సమాచారం. ప్రజ్వల్ రేవణ్న మంత్రిగా ఉన్నప్పుడు ఆమెకు నాగలాపుర పాల కేంద్రంలో పని ఇప్పించారు. అనంతరం BCM హాస్టల్‌లో వంట పని చేసేందుకు ప్రజ్వల్ అవకాశాన్ని కల్పించారు. తర్వాత 2015లో తన నివాసంలోనే బాధిత మహిళను ప్రజ్వల్ పనిలో చేర్పించుకున్నారు. రేవణ్న నివాసంలో ఆరుగురు మహిళలు, యువతులు పని చేస్తున్నారని ఆమె చెప్పారు. తాను పనిలో చేరిన నాలుగు నెలల నుంచి తనపై లైంగిక దౌర్జన్యానికి పాల్పడుతూ వచ్చారని బాధితురాలు ఆరోపించారు. ఆయన తల్లి భవానీ రేవణ్న ఇంట్లో లేని సమయం చూసి తనపై లైంగిక దౌర్జన్యానికి దిగేవారని బాధితురాలు ఆరోపణలు చేశారు.
వంటగదిలో అసభ్యంగా తాకేవాడు : బాధితురాలు
పండ్లు ఇచ్చే నెపంతో స్టోరూమ్‌కు పిలిచి వేధించేవారని బాధితురాలు వివరించారు. తాను వంట గదిలో ఉన్నప్పుడు ప్రజ్వల్ రేవణ్న తనను అసభ్యంగా తాకుతూ వేధించేవారని బాధిత మహిళ ఆరోపించారు. నలుగు స్నానం చేయించాలని, ఒంటికి తైలాన్ని పెట్టి స్నానం చేయించాలని స్నానాలగదికి తీసుకువెళ్లి లైంగిక దౌర్జన్యానికి పాల్పడ్డాడని ఆక్రోశించారు. ఇంట్లో నుంచి తన కుమార్తెకు వీడియో కాల్ చేసి ప్రజ్వల్ అసభ్యంగా ప్రవర్తించేవాడని తెలిపారు. అతని చేష్టలకు భయపడి తన కుమార్తె ప్రజ్వల్ ఫోన్ నంబరును బ్లాక్ చేసుకుందని, ఆ తర్వాత తానూ పని విడిచిపెట్టి బయటకు వచ్చేశానని వాపోయారు. కొద్ది రోజులుగా కొన్ని వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ ఉండడం, తన భర్తకు తనకు గొడవలు జరుగుతుండడం వల్ల తప్పనిసరి పరిస్థితులతో జరిగిన ఘటనలతో ఫిర్యాదు చేస్తున్నానని బాధితురాలు వెల్లడించారు.