Prajwal Revanna Sex Scandal : హాసన్ సెక్స్ రాకెట్లో ఆరోపణలు ఎదుర్కొంటూ విదేశాలకు పారిపోయిన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూ కార్నర్ నోటీసు జారీ అయ్యింది. ఈ విషయాన్ని కర్ణాటక హోంమంత్రి డాక్టర్ జీ పరమేశ్వర ఆదివారం వెల్లడించారు. ఆయనను తిరిగి భారత్‌కు రప్పించేందుకు ఇంటర్‌పోల్ అధికారుల సాయం తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. ప్రపంచంలోని అన్ని దేశాలకు ఇంటర్ పోల్ సమాచారం ఇచ్చి ఆయన్ను గుర్తిస్తుందని తెలిపారు. ప్రజ్వల్‌ను తిరిగి రప్పించే విషయాన్ని సిట్ చూసుకుంటుందని చెప్పారు. ప్రత్యేక దర్యాప్తు బృందం పనితీరును అభినందించిన పరమేశ్వర, సిట్ చట్ట ప్రకారం నడుచుకుంటుందన్నారు.
అంతర్జాతీయ పోలీసు సహకార సంస్థ నేరానికి సంబంధించిన నిందితుడి ఆచూకీ, వారి కార్యకలపాల అదనపు సమాచారాన్ని దాని సభ్య దేశాల నుంచి సేకరించేందుకు బ్లూకార్నర్ నోటీసును జారీ చేస్తుంది.
ఏ క్షణమైనా భారత్‌కు వచ్చే ఛాన్స్!
మరోవైపు ప్రజ్వల్ రేవణ్ణ ఆదివారం భారత్‌కు తిరిగి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బెంగళూరు, మంగళూరు, గోవాలో ఆయన దిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రజ్వల్ రేవణ్ణ బాధితులు ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది సిట్.
రేవణ్ణకు నాలుగు రోజుల సిట్ కస్టడీ
సిట్ అదుపులో ఉన్న ప్రజ్వల్ తండ్రి, JDS ఎమ్మెల్యే HD రేవణ్ణను ఎసీఎమ్ఎమ్ కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచారు అధికారులు. అనంతరం నాలుగు రోజుల సిట్ కస్టడీ విధించారు జడ్జి. అంతకుముందు ఆయన్ను వైద్య పరీక్షల కోసం బౌరింగ్ అండ్ లేడీ కర్జన్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి స్థానిక కోర్టుకు తరలించారు. ఈ సమయంలో మీడియాతో మాట్లాడిన రేవణ్ణ, ఇదంతా రాజకీయ కుట్రగా అభివర్ణించారు. తనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేకుండానే నిందితుడిని చేశారని తెలిపారు. శనివారం రాత్రి HD రేవణ్ణను సిట్ అధికారులు ఓ మహిళ కిడ్నాప్ కేసును ప్రాథమిక కారణంగా చూపి అరెస్ట్ చేశారు.