Post Mortem Of Living Youth :రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు మరణించాడనుకుని పోస్టుమార్టం పరీక్షలకు సిద్ధమయ్యారు వైద్యులు. తీరా స్ట్రైచర్‌పై శవ పరీక్షలు చేసే రూమ్‌లోకి తీసుకెళ్లగా యువకుడు బతికున్నట్లు తేలడం వల్ల అంతా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్ మెడికల్ కాలేజీలో జరిగింది.
అసలేం జరిగిందంటే?
మేరఠ్‌లోని గోట్కా గ్రామానికి చెందిన షగుణ్ శర్మ తన సోదరుడు ప్రిన్స్‌తో కలిసి బుధవారం రాత్రి బైక్‌పై ఖతౌలీ వైపు వెళ్తున్నాడు. అంతలో వేగంగా వస్తున్న వాహనం షగుణ్ శర్మ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సోదరులిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. రోడ్డుపై వెళ్తున్న వారు అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. దీంతో ఘటనాస్థలికి చేరుకుని అంబులెన్స్ క్షతగాత్రులిద్దర్ని సీహెచ్‌సీకి తరలించింది. అయితే షగుణ్ శర్మ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడం వల్ల అతడిని మేరఠ్ మెడికల్ కాలేజీకి తరలించాలని వైద్యులు సూచించారు.
చనిపోయినట్లు వైద్యులు నిర్ధరణ!
వైద్యుల సూచన మేరకు షగుణ్ శర్మ కుటుంబసభ్యులు అతడిని మేరఠ్ మెడికల్ కాలేజీకి తరలించారు. అక్కడ వైద్యులు షగుణ్‌కు చికిత్స అందించారు. ఆ తర్వాత షగుణ్ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టం పరీక్షల కోసం షగుణ్ మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.
బతికే ఉన్నానన్న షగుణ్!
పంచనామా చేసే వైద్యుడు ఒక్కసారి షగుణ్‌ను పరీక్షించారు. అప్పుడు షగున్ ఊపిరి పీల్చుకుంటున్నట్లు ఆయన గుర్తించారు. అప్పుడు షగుణ్‌లో కదలిక వచ్చి తాను బతికే ఉన్నానని వైద్యుడితో చెప్పాడు. దీంతో ఒక్కసారి షాక్ అయిన వైద్యులు, షగున్ బతికే ఉన్నాడని మెడికల్ కాలేజీ ఉన్నతాధికారులు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అలాగే షగుణ్‌ను ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. షగుణ్ బతికే ఉన్నాడని తెలియడం వల్ల ఆయన కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.
ఘటనపై విచారణకు ఆదేశం
ఈ ఘటన మేరఠ్ మెడికల్ కాలేజీలో కలకలం సృష్టించింది. దీంతో విచారణకు ఆదేశించారు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ ఆర్సీ గుప్తా. నిర్లక్ష్యానికి పాల్పడినవారిపై తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరోవైపు, ఈ ఘటనపై సరూప్పుర్ పోలీసుల సైతం కేసు నమోదు చేసుకున్నారు.