India China Border Soldiers : దీపావళి సందర్భంగా వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి పలు సరిహద్దు పాయింట్ల వద్ద భారత, చైనా సైనికులు స్వీట్లు పంచుకున్నారు. తూర్పు లద్దాఖ్‌లోని దెప్పాంగ్, దేమ్‌చుక్ ప్రాంతాల నుంచి సైన్యాల ఉహసంహరణ ప్రక్రియ కొలిక్కి రావడం వల్ల గురువారం ఉదయం మిఠాయిలు అందించుకున్నారు. ఈ విషయాన్ని ఆర్మీ వర్గాలు తెలిపాయి.
"దీపావళి సందర్భంగా ఎల్‌ఏసీ వెంబడి అనేక సరిహద్దు పాయింట్ల వద్ద భారత్, చైనా సైనికులు స్వీట్లను ఇచ్చిపుచ్చుకున్నారు. అక్టోబర్ 25న మొదలైన బలగాల ఉపసంహరణ ప్రక్రియ బుధవారంతో పూర్తయ్యింది. పెట్రోలింగ్ విధి విధానాలను ఖరారు చేసేందుకు క్షేత్రస్థాయిలో స్థానిక కమాండర్ల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. వారే పెట్రోలింగ్ పద్ధతులను నిర్ణయిస్తారు" అని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.
Soldiers of the Indian and Chinese Army exchange sweets at the Chushul-Moldo border meeting point on the occasion of #Diwali.
— ANI (@ANI) October 31, 2024
(Source: Indian Army) pic.twitter.com/MwhGgIYQ98
మరోవైపు, వాస్తవాధీన రేఖ వెంబడి భారత్-చైనా బలగాల ఉపసంహరణ పూర్తయిందని కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు. ఇంతకు మించిన పురోగతిని భారత్ కోరుకుంటోందని, అందుకు కొంత సమయం పట్టొచ్చని చెప్పారు. వాస్తవాధీన రేఖ వెంబడి కొన్ని ప్రాంతాల్లో ఉన్న వివాదాలను పరిష్కరించుకునేందుకు ఇరు దేశాలు దౌత్య, సైనిక స్థాయిలో చర్చలు జరిపాయని వెల్లడించారు. చాలా విషయాల్లో ఇరు దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయని తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌లో సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహాన్ని వర్చువల్‌గా ప్రారంభించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
2020 జూన్‌లో గల్వాన్ లోయలో ఇరుదేశాల సైన్యాల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణ నేపథ్యంలో భారత్-చైనా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ తర్వాత ప్రతిష్టంభనను తొలగించేందుకు ఇరు దేశాల మధ్య పలుమార్లు దౌత్య, కమాండర్ స్థాయి చర్చలు జరిగాయి. వాటి ఫలితంగా ఇప్పటికే కొన్ని ప్రాంతాల నుంచి బలగాలను ఉపసంహరించగా ఘర్షణల కేంద్రమైన దెప్సాంగ్, దేమ్‌చుక్ వద్ద మాత్రం బలగాలు కొనసాగుతూ వచ్చాయి. అలా నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ ఇటీవల వాస్తవాధీన రేఖ వెంబడి గస్తీ పునఃప్రారంభంపై ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది.