Politicians Assets :దేశంలో సార్వత్రిక ఎన్నికల సందడి మొదలైంది. ఇప్పటికే ఏప్రిల్ 19న జరగనున్న తొలిదశ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ దాఖలుకు గడువు ముగియగా, రెండో విడత పోలింగ్‌కు గురువారం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ సందర్భంగా పలువురు నాయకులు నామినేషన్లు దాఖలు చేశారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేశ్, మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ నామినేషన్లు దాఖలు చేశారు. వీరిద్దరితోపాటు మధ్యప్రదేశ్ ఏకైక కాంగ్రెస్ ఎంపీ నకుల్‌నాథ్ ఆస్తుల వివరాలు బయటకొచ్చాయి.
నకుల్ నాథ్‌కు రూ.700 కోట్ల ఆస్తి!
మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ కుమారుడు, కాంగ్రెస్ పార్టీ ఎంపీ నకుల్ నాథ్ మరోసారి ఛింద్వాడా నుంచి బరిలో దిగారు. ఈ సందర్భంగా తన ఎన్నికల అఫిడవిట్లో దాదాపు రూ.700 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. ఆయన అఫిడవిట్ ప్రకారం గత ఐదేళ్లలో నకుల్ నాథ్ సంపద రూ.40 కోట్లు పెరిగింది. అయితే నకుల్ నాథ్ తరచూ హెలికాప్టర్‌ను వాడుతున్నా, తన వద్ద కారు కూడా లేనట్లు అఫిడవిట్లో తెలిపారు.
నగదు, షేర్లు, బాండ్లు కలిపి రూ.649.51 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నట్లు నకుల్ నాథ్ ఎన్నికల కమిషన్‌కు అందించిన అఫిడవిట్లో పేర్కొన్నారు. రూ.48.07 కోట్ల స్థిరాస్తులున్నట్లు తెలిపారు. 2019లో రూ.660 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు నకుల్‌నాథ్. గత ఎన్నికల్లో 29 లోక్‌సభ స్థానాల్లో 28 చోట్ల బీజేపీ గెలవగా, ఏకైక కాంగ్రెస్ ఎంపీగా నకుల్ నాథ్ నిలిచారు.