PM Narendra Modi vs Rahul Gandhi in Lok Sabha :హిందుత్వ అంశంపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారానికి దారితీశాయి. సోమవారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై, చర్చ సందర్భంగా రాజ్యాంగంపై దాడి జరుగుతోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. అధికార బీజేపీ ప్రతిపాదించిన అంశాలను వ్యతిరేకిస్తున్న లక్షలాది మందిపై దాడి జరుగుతోందని చెప్పారు. తనపైనా వ్యక్తిగతంగా దాడి జరిగిందని రాహుల్ గాంధీ అన్నారు. కొందరు నేతలు ఇప్పటికీ జైలులో ఉన్నారని చెప్పారు. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు, తనపై 20 కేసులు నమోదయ్యాయని, తనకు ఇచ్చిన ఇంటిని కూడా లాగేసుకున్నారని ఆరోపించారు. ఈడీ(ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) 55 గంటలకుపైగా ప్రశ్నించిందని వివరించారు. అన్ని మతాలు ధైర్యంగా ఉండమనే ప్రబోధిస్తున్నాయని రాహుల్ వివరించారు. అయితే హిందువులుగా చెప్పుకుంటున్న వారు 24 గంటలూ కేవలం అహింస, ద్వేషం, అసత్యమే మాట్లాడుతున్నారని, మీరు అసలు హిందువులేనా అని రాహుల్ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ, అధికార పక్ష నేతలు తీవ్ర అభ్యంతరం తెలిపారు.
"భారత చరిత్రలో 3 మూలస్తంభాలైన సిద్ధాంతాలు ఉన్నాయి. మోదీ ఒకసారి మాట్లాడుతూ భారత్‌ను ఎవరూ ఆక్రమించలేరని చెప్పారు. అందుకు కారణం ఉంది. మన దేశం అహింసా దేశం. ఈ దేశం భయపడే దేశం కాదు. మన మహాపురుషులందరూ అహింస గురించే చెప్పారు. భయం వద్దన్నారు. భయం వద్దు, భయపడొద్దన్నారు. ఇంకోవైపు మహాశివుని రూపాన్ని చూస్తే భయం వద్దు, భయపడొద్దని చెబుతోంది. ఆయన అభయ హస్తం అహింస గురించి మాట్లాడితే శూలంతో పొడుస్తామంటుంది. ఎవరైతే హిందువుగా చెప్పుకుంటున్నారో వారు 24 గంటలూ హింస, హింస, హింస అంటున్నారు. ద్వేషం, ద్వేషం. అసత్యం, అసత్యం, అసత్యం. మీరు హిందువులే కాదు. హిందూ ధర్మం సత్యమే చెప్పమంటోంది. సత్యాన్ని దాచవద్దని, సత్యం చెప్పడానికి భయం వద్దంటుంది. అహింసే మా విధానం. అదే అభయముద్ర." అని అన్నారు రాహుల్ గాంధీ.
ప్రధాని మోదీ తీవ్ర అభ్యంతరం
రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా తప్పుబట్టారు. మొత్తం హిందువులను అందరినీ హింసాపరులుగా సంబోధించడం తీవ్రమైన అంశమని మోదీ అభ్యంతరం తెలిపారు. వెంటనే రాహుల్ ఎదురుదాడి చేసే ప్రయత్నం చేశారు. 'కాదు కాదు, నరేంద్ర మోదీ మొత్తం హిందూ సమాజం కాదు. బీజేపీ మొత్తం హిందూ సమాజం కాదు. ఆర్ఎస్ఎస్ మొత్తం హిందూ సమాజం కాదు.' అని రాహుల్ అన్నారు.