PM Narendra Modi Tamil Nadu Visit : ఎన్డీఏ ప్రభుత్వం గత పదేళ్లలో వికసిత్ భారత్‌కు పునాది వేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. భారత్ ఇప్పుడు ప్రపంచశక్తిగా ఎదుగుతోందని చెప్పారు. 2014లో తమ ప్రభుత్వం అధికారం చేపట్టే వరకు ఆర్థిక వ్యవస్థకు సంబంధించి చిన్నా లేదా పెద్ద నిర్ణయాలు తీసుకునేవారు కాదని, ఎప్పుడూ కుంభకోణాల గురించి మాత్రమే వార్తలు వచ్చేవన్నారు. ఎప్పుడైనా ఆర్థికవ్యవస్థ కుప్పకూలవచ్చని చెప్పుకునేవారని ప్రధాని మోదీ తెలిపారు.
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడులోని వెల్లూరు, కోయంబత్తూరు జిల్లాల్లో జరిగిన సభలో పాల్గొన్న ప్రధాని మోదీ, కాంగ్రెస్, డీఎంకేలపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. కుటుంబ సంస్థ అయిన డీఎంకే, తన పాత ఆలోచనా విధానాలతో తమిళనాడు యువత అభివృద్ధిని అడ్డుకుంటుందని విమర్శించారు. అవినీతిపై డీఎంకేకు మొదటి కాపీరైట్స్ ఉన్నాయని, ఆ కుటుంబమంతా తమిళనాడును దోచుకుంటోందని దుయ్యబట్టారు. తమిళనాడు ప్రజలకు డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు చేసిన మోసం గురించి ఇప్పుడు దేశమంతా చర్చ జరుగుతోందన్నారు. ఆ రెండు పార్టీలు కేవలం జాలర్లకు మాత్రమే కాదు మొత్తం దేశానికి తీవ్ర అన్యాయం చేశాయని ప్రధాని మోదీ ఆరోపించారు.
"గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు ఇచ్చారు. ఈ అంశంపై కాంగ్రెస్ నోరువిప్పదు. గతకొన్నేళ్లలో ఆ ద్వీపం వద్దకు వెళ్లిన తమిళనాడుకు చెందిన వేలాదిమంది జాలర్లు అరెస్టయ్యారు. వారి బోట్లను స్వాధీనం చేసుకున్నారు. కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు ఇచ్చిన విషయాన్ని తమిళనాడు ప్రజలకు చెప్పరు. ఎన్డీఏ ప్రభుత్వం అలాంటి జాలర్లను నిరంతరం విడుదల చేయించి వెనక్కి తీసుకొస్తోంది. అంతేకాదు శ్రీలంక ఐదుగురు జాలర్లు ఉరిశిక్ష కూడా విధించింది. వారిని కూడా నేను ప్రాణాలతో వెనక్కి తీసుకోచ్చాను."
--నరేంద్రమోదీ, ప్రధానమంత్రి
వెల్లూరు తర్వాత కోయంబత్తూరు జిల్లా మెట్టుపాలయమ్ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ, కాంగ్రెస్, డీఎంకేలపై తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్, డీఎంకేలు అవినీతిపరులను కాపాడేందుకు ముందు నిలుస్తున్నాయని విమర్శించారు. విద్వేష రాజకీయాలు చేస్తున్న డీఎంకే, తమిళనాడు అభివృద్ధి పట్టించుకోవడం లేదని దుయ‌్యబట్టారు. కాంగ్రెస్, డీఎంకేలు ఎస్సీ, ఎస్టీ, OBCలను ఇళ్లు, కరెంట్ కోసం చాలాకాలం ఆరాటపడేలా చేశాయని విమర్శించారు. బీజేపీ కోట్ల మందికి ఇళ్లు కట్టించిందని, ప్రతి గ్రామానికి విద్యుత్తు సదుపాయం కల్పించిందన్నారు. 80కోట్ల మందికి ఉచిత రేషన్ ఇచ్చినట్లు ప్రధాని మోదీ వివరించారు. ఆ పథకం ద్వారా లబ్ధిపొందినవారంతా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు చెందినవారేనని అధికమన్నారు. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలో ఉందనే అంశం ఆధారంగా వివక్ష చూపారని మోదీ ఆరోపించారు.
"తమ కూతుళ్లు, కొడుకులు తప్ప పేదలు లేదా గిరిజనులు ఉన్నత స్థానాల్లో ఉండాలని కుటుంబ పార్టీలు ఆలోచించలేదు. బీజేపీ తొలిసారి ఒక గిరిజన మహిళను రాష్ట్రపతిని చేసింది. ఆ సమయంలో కూడా ఇండియా కూటమి సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. దేశంలో పెట్టుబడులు సమాప్తం చేయాలనుకున్న వాళ్లతో డీఎంకే చేరింది. తమ రాజకీయాల కోసం వీళ్లు తమిళనాడుకు తీవ్ర నష్టం కలిగించారు. బీజేపీ ప్రభుత్వం తమిళనాడులోని ఈప్రాంతంలో రక్షణ కారిడార్ నిర్మిస్తోంది. అది కోయంబత్తూర్‌కు కూడా వస్తుంది. ఇండియా కూటమికి ఉన్న మనస్తత్వానికి వాళ్లు రక్షణ కారిడార్ నిర్మించేవారా? ఎవరైనా పెట్టుబడిదారులు మన దేశానికి, తమిళనాడుకు వచ్చేవారా?"
--నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
మహారాష్ట్రలోను ప్రచారం
లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏకు వేసే ప్రతి ఓటు తమిళనాడు భవిష్యత్తుకు గ్యారంటీ అవుతుందని ప్రధాని మోదీ అన్నారు. అనంతరం మహారాష్ట్ర రామ్టెక్లో జరిగిన బహిరంగ సభలోనూ మోదీ ప్రసంగించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, ఎన్సీపీ నేతలు పాల్గొన్నారు.