PM Modi Inaugurated Aircraft Plant: గుజరాత్‌లోని వడోదరలో సి-295 సైనిక రవాణా విమానాల ఉత్పత్తి కోసం ఏర్పాటు చేసిన కర్మాగారాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్‌తో కలిసి సోమవారం ప్రారంభించారు. అనంతరం కర్మాగారంలోని విశేషాలను ఎయిర్‌బస్ సంస్థకు చెందిన ఉద్యోగులు ప్రధానికి వివరించారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్, టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ పాల్గొన్నారు. అంతకుముందు ప్రధాని మోదీ, సాంచెజ్ కలిసి ఓపెన్ జీప్‌లో విమానాశ్రయం నుంచి టాటా ఎయిర్ క్రాఫ్ట్ కాంప్లెక్స్ వరకు రోడ్ షోను నిర్వహించారు.
'ఈ కర్మాగారంతో ఇరుదేశాల బంధం మరింత బలోపేతం'
వడోదరలో ఏర్పాటైన సి-295 విమానాల కర్మాగారం భారత్, స్పెయిన్ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తుందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. వడోదరలో తయారయ్యే విమానాలు భవిష్యత్తులో ఇతర దేశాలకు ఎగుమతి అవుతాయని ధీమా వ్యక్తం చేశారు. వడోదరలో ఎయిర్‌క్రాఫ్ట్ తయారీ ప్రాజెక్ట్ 'మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్' మిషన్‌ను కూడా బలోపేతం చేస్తుందని తెలిపారు.
"గత దశాబ్దంలో భారత్ విమానయాన రంగంలో మంచి వృద్ధి సాధించింది. భారతదేశాన్ని ఏవియేషన్ హబ్‌గా మార్చేందుకు కృషి చేస్తున్నాం. భవిష్యత్తులో భారత్, ప్రపంచ దేశాల అవసరాలను తీర్చడంలో వడోదరలో ఏర్పాటు చేసిన కర్మాగారం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం భారత్ రక్షణ రంగం తయారీలో ఉన్నత శిఖరాలను తాకుతోంది. పదేళ్ల క్రితం తీసుకున్న నిర్ణయాలే ప్రస్తుతం ఈ స్థాయిలో దేశాన్ని నిలబెట్టాయి. రక్షణ రంగం పరికరాల తయారీలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని విస్తరించాం. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను ఏడు పెద్ద కంపెనీలుగా మార్చాం. డీఆర్డీఓ, హాల్‌ను బలోపేతం చేశాం. యూపీ, తమిళనాడులో రెండు పెద్ద రక్షణ కారిడార్లను నిర్మించాం. ఇలాంటి ఎన్నో నిర్ణయాలు రక్షణ రంగంలో కొత్త శక్తిని నింపాయి."
-నరేంద్ర మోదీ, భారత ప్రధాని
స్పెయిన్‌లో యోగా కూడా బాగా ప్రాచుర్యం పొందిందని తాను విన్నానని ప్రధాని మోదీ తెలిపారు. స్పెయిన్ ఫుట్‌బాల్ టీమ్‌ను భారతీయులకు చాలా ఇష్టపడతారని చెప్పుకొచ్చారు. "ఇది నా స్నేహితుడు పెడ్రో శాంచెజ్ మొదటి భారతదేశ పర్యటన. ఇకనుంచి మేము భారత్- స్పెయిన్ భాగస్వామ్యానికి కొత్త దిశను అందిస్తున్నాం. సి-295 విమానాల ఉత్పత్తి కర్మాగారాన్ని ప్రారంభించాం" అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
'2026 నాటికి తొలి విమానం'
టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ నుంచి మొదటి విమానం 2026లో అందుబాటులోకి వస్తుందని స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ తెలిపారు. ప్రధాని మోదీ దార్శనికత భారత్‌ను పారిశ్రామిక శక్తిగా మార్చిందని కొనియాడారు. వడోదరలో ఏర్పాటైన ఈ కర్మాగారం ఇతర ఐరోపా దేశాలు భారత్‌కు వచ్చేందుకు ద్వారాలు తెరిచిందని వ్యాఖ్యానించారు. ఎయిర్ బస్, టాటా భాగస్వామ్యం భారత వైమానిక రంగ పురోగతికి బాటలు వేస్తుందన్నారు.
'రెండేళ్లలో పూర్తి చేస్తాం'
నేటి నుంచి కచ్చితంగా రెండేళ్లలో తొలి విమానం డెలివరీ చేస్తామని ప్రధానికి హామీ ఇచ్చారు టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్. ఆ రోజు మళ్లీ ప్రధాని ఇక్కడికి వచ్చి దానిని ఆవిష్కరించేందుకు వీలుగా తేదీని రిజర్వ్ చేయాలని పీఎంఓను కోరినట్లు తెలిపారు. టాటా గ్రూప్‌నకు చెందిన 200 మంది ఇంజినీర్లు ఇప్పటికే స్పెయిన్‌లో శిక్షణ పొందుతున్నారన్నారు. తాము 40ఎస్ ఎంఈలతో కలిసి పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు కోసం 2012 నుంచే దివంగత రతన్ టాటా కృషి చేసినట్లు వెల్లడించారు. ఎయిర్ బస్ సంస్థతో స్నేహ సంబంధాలు నడిపి ఈ భాగస్వామ్యానికి పునాది వేశారన్నారు.
2022లోనే మోదీ శంకుస్థాపన
టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్‌కు చెందిన ఈ కర్మాగారానికి 2022 అక్టోబరులో మోదీ శంకుస్థాపన చేశారు. భారత్‌కు 40 సి-295 విమానాల సరఫరాకు 2021 సెప్టెంబరులో రూ.21,935 కోట్ల ఒప్పందం కుదిరింది. ఇందులో 16 విమానాలు స్పెయిన్‌లోని ఎయిర్‌బస్ సంస్థ కర్మాగారం నుంచి అందుతాయి. మిగతావి వడోదర యూనిట్‌లో సిద్ధమవుతాయి. కాలం చెల్లిన ఆవ్రో-748 విమానాల స్థానంలో భారత వాయుసేన వీటిని ప్రవేశపెట్టనుంది.