PM Modi Rojgar Mela : పదేళ్లలో గత ప్రభుత్వం కంటే ఒకటిన్నర రెట్లు అధికంగా ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. 2014 నుంచి ప్రతి యువకుడిని దేశాభివృద్ధిలో భాగం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించే ప్రక్రియను వేగవంతం చేశామని చెప్పారు. అంతకుముందు ప్రభుత్వాలు ప్రకటన నుంచి నియామకం చేసే వరకు చాలా సమయం పట్టేదని విమర్శించారు. గత ప్రభుత్వాలు నియామకాల్లో అవినీతికి పాల్పడేవని, కానీ తాము నియామక ప్రక్రియను పారదర్శకంగా మార్చామన్నారు. నియామక ప్రక్రియను నిర్ణీత కాలవ్యవధిలోనే పూర్తి చేసేలా చేశామని, దీంతో ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు వస్తాయని చెప్పారు. రోజ్‌గార్ మేళాలో (rojgar mela 2024 central government) భాగంగా సుమారు లక్ష మందికి పైగా యువకులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నియామక పత్రాలు అందజేశారు ప్రధాని మోదీ.
"ప్రపంచంలోనే మూడో అతిపెద్ద అంకుర వ్యవస్థ మన సొంతం. ప్రస్తుతం దేశంలో 1.25లక్షల స్టార్టప్‌లు (narendra modi on startup) ఉన్నాయి. అనేక చిన్న పట్టణాలు, నగరాల్లోని యువకులు సైతం వీటిని ప్రారంభిస్తున్నారు. ఇవి అనేక ఉద్యోగావకాశాలను సృష్టిస్తున్నాయి. మా ప్రభుత్వం స్టార్టప్‌లకు అనేక పన్ను మినహాయింపులను ఇస్తుంది. పరిశోధన, అభివృద్ధి కోసం రూ.లక్ష కోట్లతో నిధిని ఏర్పాటు చేశాం. గత ప్రభుత్వాలు ప్రజల బాధలను విస్మరించాయి. 2014 తర్వాత రైల్వేలు ఆధునీకరణపై దృష్టి పెట్టాము. ఈ సారి కేంద్ర బడ్జెట్లో 40,000 సాధారణ బోగీలను వందేభారత్ ప్రమాణాలకు మార్చాలి అని నిర్ణయించాం."
--నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి