PM Modi Parliament Speech :రాష్ట్రపతి ప్రసంగానికి లోక్‌సభలో సోమవారం ధన్యవాదాలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ. దాదాపు 100 నుంచి 125 రోజుల వ్యవధిలో జరగనున్న 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 370 సీట్లు వస్తాయని, ఎన్డీఏ కూటమి 400కు పైగా సీట్లు గెలుస్తుందని మోదీ జోస్యం చెప్పారు. ఎన్డీఏ మూడో టర్మ్‌లో అతిపెద్ద నిర్ణయాలు తీసుకుంటామని మోదీ స్పష్టం చేశారు. వెయ్యేళ్లకు అవసరమైన బలమైన పునాది వేస్తామని చెప్పుకొచ్చారు. విపక్షాలు చాలాకాలం ప్రతిపక్షంలోనే ఉండాలని సంకల్పం తీసుకున్నాయని ఎద్దేవా చేశారు. దశాబ్దాల తరబడి అధికారంలో ఉన్నందున మళ్లీ దశాబ్దాల పాటు విపక్షంలో ఉండాలని వారు భావిస్తున్నారని అన్నారు. విపక్షాల కోరికను భగవంతుడు నెరవేరుస్తారని తాను భావిస్తున్నట్లు తెలిపారు.
ఎన్నికల తర్వాత విపక్ష నేతలు ప్రేక్షకుల సీట్లకు పరిమితమవుతారని మోదీ జోస్యం చెప్పారు. ఎన్నికల్లో ఓటమి కోసమే విపక్షాలు తీవ్రంగా కష్టపడుతున్నాయన్నారు. విపక్షాల తీరుపై దేశ ప్రజలు తీవ్ర నిరాశ చెందారని, ఎన్నికలు ఏ విధంగా ఎదుర్కోవాలో తెలియని స్థితిలో విపక్షాలు ఉన్నాయి విమర్శించారు. జాతి మొత్తం ఆరోగ్యకరమైన ప్రతిపక్షాన్ని కోరుకుంటోందని, విపక్షాల దుస్థితికి కాంగ్రెస్ పార్టీ జవాబుదారీ అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
'నేతలు మారినా రాగం అదే'
'కొన్ని నిర్మాణాత్మక సూచనలు చేసేందుకు విపక్షాలకు బడ్జెట్ సమావేశాలు మంచి అవకాశం. కానీ ప్రతిపక్ష సభ్యులు ఆ సదావకాశాన్ని కూడా వదులుకున్నారు. మీరు దేశాన్ని భ్రమలో ముంచి వెళ్లిపోయారు. కాంగ్రెస్‌లో నాయకులు మారారు కానీ అదే రాగం కొనసాగుతోంది. ఇది ఎన్నికల సమయం, ప్రతిపక్షాలు మరి కాస్త కష్టపడి, ప్రజలకు కొత్త సందేశం పంపించి ఉండాల్సింది. కానీ అందులో కూడా మీరు ఘోరంగా విఫలమయ్యారు. ఈ ప్రాథమిక విషయాన్ని నేను మీకు నేర్పుతాను' అని మోదీ ప్రతిపక్షాలను దుయ్యబట్టారు.
"పార్లమెంటులో ఉన్నంతకాలం ఏదైనా మంచి చేయడానికి ప్రయత్నించాలి. వారసత్వం అనేది కాంగ్రెస్ దుకాణం మూసివేతకు కారణమవుతోంది. రాజ్‌నాథ్‌సింగ్, అమిత్‌షాకు సొంత పార్టీలు ఏమీ లేవు. వారసత్వ పాలనకు ఖర్గే, ఆజాద్ బాధితులు అయ్యారు. ఒకే నేతను కాంగ్రెస్ పదే పదే జనంపై రుద్దే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీలో వారసత్వ రాజకీయ బాధితులు ఉన్నారు. వారసత్వ రాజకీయాలకు ఖర్గే, ఆజాద్ బాధితులు అయ్యారు. ఖర్గే రాజ్యసభకు వెళ్లారు, ఆజాద్ ఏకంగా పార్టీ వదిలివెళ్లారు."
-- నరేంద్ర మోదీ, భారత ప్రధాని
'నెహ్రూకు భారతీయులపై విశ్వాసం లేదు'
దేశ శక్తి, సామర్థ్యాలపట్ల కాంగ్రెస్‌కు ఎప్పుడూ నమ్మకం లేదని ప్రధాని మోదీ విమర్శించారు. 'ప్రధానిగా నెహ్రూ తొలి ప్రసంగంలోనే విదేశీయులతో పోలిస్తే భారతీయులకు నైపుణ్యం లేదని అన్నారు. భారతీయుల శక్తిపై విశ్వాసం వ్యక్తం చేయలేదని చెప్పారు. భారతీయులు నెమ్మదిగా, సోమరుల్లా పని చేస్తారని నెహ్రూ అన్నారు. జవహర్‌లాల్ నెహ్రూ చేసిన తప్పులకు కశ్మీర్ ప్రజలు, దేశం భారీ మూల్యం చెల్లించుకుంది. ఇందిరాగాంధీ కూడా నెహ్రూ కంటే ఏమీ తక్కువ కాదు. భారతీయులకు ఆత్మన్యూనత ఎక్కువ అని ఆమె అన్నారు. నెహ్రూ, ఇందిరాగాంధీకి భారతీయుల శక్తిపై అంత నమ్మకం ఉండేది కాదు. మూడో దఫాలో మేం వికసిత్ భారత్ లక్ష్యాల కోసం పని చేస్తాం' అని ప్రధాని మోదీ తెలిపారు.