Pm Modi On INDIA Alliance : ఉత్తర్‌ప్రదేశ్‌లో అభివృద్ధి జరుగుతున్న కొద్దీ, ఇండియా కూటమి బుజ్జగింపు అనే విషం బలహీనపడుతోందని ప్రధాని మోదీ ఘాటుగా విమర్శించారు. తనకు కుటుంబం లేదంటున్నారని, కానీ దేశంలోని 140 కోట్లమంది ప్రజలు 'మోదీ కా పరివార్' అని వారు మరిచిపోయారని చురకలు అంటించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ రూ.34,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసి ప్రసంగించారు.
2047 నాటికి వికసిత్ భారత్
ఆజంగఢ్‌లో తాము చేస్తున్న అభివృద్ధి- ఓట్ బ్యాంకుపై ఆధారపడిన ఇండియా కూటమికి నిద్ర లేకుండా చేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. 7 ఏళ్లలోనే సీఎం యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో రాష్ట్రం బాగా అభివృద్ధి చెందిందని తెలిపారు. 'ఆజంగఢ్ ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతం. ఇప్పుడు అభివృద్ధిలో దేశంలోనే కొత్త అధ్యయాన్ని లిఖిస్తోంది. ఈ ప్రాజెక్టులను మేము శంకుస్థపనలు చేశాం. అవి ఎన్నికల కోసం చేయలేదు. 2024లోనూ వీటిని ఎన్నికల దృష్టిలో చూడొద్దు. అభివృద్ధి కోసం నేను చేస్తున్న ఉద్యమం ఇది. 2047 నాటికి దేశాన్ని వికసిత్ భారత్‌గా మార్చాలనే సంకల్పంతో వేగంగా పరుగులు పెడుతున్నా. అంతే వేగంగా దేశాన్ని పరుగెత్తిస్తున్నా' అని మోదీ తెలిపారు.
15 విమానాశ్రయ ప్రాజెక్టులు
ఉత్తర్‌ప్రదేశ్ పర్యటనలో భాగంగా రూ.10,000 కోట్ల విలువైన 15 విమానాశ్రయాల ప్రాజెక్టుతో పాటు 12 టెర్మినల్ భవనాలకు ప్రారంభాలు, శంకుస్థాపనలు చేశారు. ఆజంగఢ్, శ్రవస్తి, చిత్రకూట్, అలీగఢ్ విమానాశ్రయాలతోపాటు చౌధరీ చరణ్‌సింగ్ టెర్మినల్‌తో పాటు ఆజంగఢ్‌లో మహారాజా సుహేల్ దేవ్ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభోత్సవం చేశారు. రూ. 11,500 కోట్ల వ్యయంతో చేపట్టిన ఐదు ప్రధాన జాతీయ రహదారులకు శంకుస్థాపనలు చేశారు.