PM Modi On Development In India :భారత్‌ను ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు వచ్చే ఐదేళ్లలో మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగాన్ని అనేక రెట్లు వేగవంతం చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఈ క్యాలెండర్ ఇయర్‌లో ఇప్పటివరకు రూ. 10 లక్షల కోట్లు విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశామని చెప్పారు. దేశంలో మిగతా ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలకు సమయం చాలా తక్కువగా ఉందని తెలిపారు.
'కాంగ్రెస్‌కు నిద్రపట్టడం లేదు'
దేశవ్యాప్తంగా సుమారు రూ.లక్ష కోట్లు విలువైన 114 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేసిన అనంతరం హరియాణాలోని గురుగ్రామ్‌లో జరిగిన సభలో మోదీ ప్రసంగించారు. దేశంలో జరుగుతున్న అభివృద్ధి పనుల వేగాన్ని చూశాక ప్రతిపక్ష పార్టీ, ఇండియా కూటమికి నిద్ర పట్టడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ప్రతి విషయాన్ని తప్పుడు కోణంలో చూస్తుందని మండిపడ్డారు.
'2047 నాటి దేశాన్ని వికసిత్ భారత్‌గా!'
2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని అత్యంత వేగంతో సాధించాలని తాను కోరుకుంటున్నానని మోదీ ఉద్ఘాటించారు. 2047 నాటి దేశాన్ని వికసిత్ భారత్‌గా చూడాలనుకుంటున్నట్లు చెప్పారు. 2014లో 11వ స్థానంలో ఉన్న భారత్ ఇప్పుడు ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని వెల్లడించారు. త్వరలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించనుందని తెలిపారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తమ ప్రభుత్వం పని చేయడం లేదని, ఎప్పుడూ అభివృద్ధి పనులు జరుగుతూనే ఉన్నాయని చెప్పారు.
'మహిళా శక్తి ఎదుగుదలలో కొత్త అధ్యాయం'
మరోవైపు, కేంద్రంలో మూడోసారి తాను అధికారంలోకి వస్తే మహిళా శక్తి ఎదుగుదలలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తానని ప్రధాని మోదీ తెలిపారు. మహిళల స్థాయిని పెంపొందించి వారికి అవకాశాలను సృష్టించే సమాజం మాత్రమే ముందుకు సాగగలదని చెప్పారు. దిల్లీలో సశక్త్ నారి-వికసిత్ భారత్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గత ప్రభుత్వాలు మహిళల జీవితాలు, వారి కష్టాలకు ప్రాధాన్యమిచ్చేవి కావని విమర్శించారు. మరుగుదొడ్లు లేకపోవడం, శానిటరీ ప్యాడ్‌ల వాడకం, పొగను కలిగించే ఇంధనాల వల్ల కలిగే దుష్పరిణామాలు ఇతర సమస్యల గురించి మొదట మాట్లాడిన ప్రధానిని తానేనని మోదీ పేర్కొన్నారు.