PM Modi on Congress : కాంగ్రెస్ పార్టీని తుక్డే తుక్డే గ్యాంగ్, అర్బన్ నక్సల్స్ నడుపుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ఇప్పుడు చూస్తున్న కాంగ్రెస్ పార్టీ, గతంలో మహాత్మాగాంధీతో సంబంధమున్న పార్టీ కాదన్నారు. పీఎం విశ్వకర్మ పథకం ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా మహారాష్ట్రలోని వార్ధాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఈ మేరకు కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో విద్వేషం అనే దెయ్యం ప్రవేశించింది. అందుకే కాంగ్రెస్ పార్టీలో దేశభక్తి అనే ఆత్మ తుది శ్వాస విడిచింది. కాంగ్రెస్ నేతలు (రాహుల్ గాంధీని ఉద్దేశించి) విదేశీ పర్యటన సందర్భంగా దేశ వ్యతిరేక అజెండాపై మాట్లాడుతుంటారు. ఇప్పటి కాంగ్రెస్ పార్టీ గణపతి పూజను కూడా ద్వేషిస్తోంది. స్వాతంత్య్ర పోరాటంలో లోకమాన్య తిలక్ నేతృత్వంలో గణపతి వేడుకలు దేశ ఐక్యతా ఉత్సవాలుగా మారాయి. గణపతి వేడుకల్లో అన్నివర్గాల ప్రజలు పాల్గొనేవారు. అందుకే కాంగ్రెస్ పార్టీ గణపతి పూజ పట్ల వ్యతిరేక భావంతో ఉంది. నేను గణేశ్ పూజ కార్యక్రమానికి వెళ్లా, కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయం నిద్ర లేచింది. గణేశ్ పూజను కూడా వ్యతిరేకించటం మొదలుపెట్టింది. బుజ్జగింపు రాజకీయాల కోసం ఏమైనా చేస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం గణపతి బప్పాను కూడా కటకటాల వెనక్కి పంపింది. గణపతికి జరిగిన ఈ అవమానాన్ని చూసి దేశం మొత్తం ఉలిక్కిపడింది. కానీ ఈ విషయంపై పార్టీ మిత్రపక్షాలు మాత్రం మౌనంగా ఉండటం ఆశ్చర్యంగా ఉంది. కాంగ్రెస్ చేసిన ఈ పాపాలకు మనం ఏకమై సమాధానం చెప్పాలి.