PM Modi Lights Ram Jyoti :రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ వేడుకను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. అందులో భాగంగా ప్రముఖ నాయకులు, ప్రజలు రాత్రి 'రామజ్యోతిని' వెలిగించి రామునిపై తమ భక్తిని చాటుకున్నారు. మరికొందరు బాణసంచా కాల్చి జై శ్రీరామ్ అనే నామస్మరణతో సంబరాలు చేసుకున్నారు.
ప్రధానమంత్రి మోదీ దిల్లీలోని తన నివాసంలో రామ విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా బాల రాముని చిత్రపటం ముందు జ్యోతులను వెలిగించారు. రాముడి చిత్రపటానికి హారతి ఇచ్చారు. వీటికి సంబంధించిన ఫొటోలను 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ తన కుటుంబ సభ్యులతో కలిసి దీపాలు వెలిగించి రామనామస్మరణ చేస్తూ దీపోత్సవం జరుపుకొన్నారు. అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠాపనను పురస్కరించుకొని తమిళనాడులోని చెన్నైలో ప్రజలు రహదారులపై ఆలయరూపంలో దీపాలను వెలిగించారు. ఆ వెలుగుల మధ్యలో రాముని చిత్రపటాన్ని ఉంచి రామనామ స్మరణచేస్తూ దీపోత్సవం జరుపుకొన్నారు.
రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠాపనను పురస్కరించుకొని సరయూ ఘాట్ వద్ద దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని రామనామాన్ని పలికారు. రామజ్యోతి కార్యక్రమంలో భాగంగా ఛండీగఢ్‌లోని రాయ్‌పూర్‌లో ప్రజలు భారీ సంఖ్యలో మైదానం వద్దకు చేరి మట్టితో చేసిన ప్రమిదల్లో జ్యోతులు వెలిగించారు. మరికొంత మంది బాణసంచా పేల్చి రామునిపై తమ అభిమానాన్ని తెలిపారు. గుజరాత్ సీఎం భుపేంద్ర పటేల్ తన అధికార నివాసంలో దీపాలను వెలిగించి రాముని ప్రాణ ప్రతిష్ఠ వేడుకలు చేసుకున్నారు.