తాను ఎల్లప్పుడూ జమ్ముకశ్మీర్ ప్రజలను కుటుంబంలా భావిస్తానని ప్రధాని మోదీ చెప్పారు. 'కుటుంబ సభ్యులు నా హృదయంలో ఉంటారు. జమ్ముకశ్మీర్ అభివృద్ధికి నేను హామీ ఇస్తున్నాను. జమ్ముకశ్మీర్‌లో అభివృద్ధి పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగవు.' అని ప్రధాని మోదీ తెలిపారు.
2.12PM
ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్ ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందని ప్రధాని మోదీ తెలిపారు. దశాబ్దాలుగా రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్, ఆ పార్టీ మిత్రపక్షాలు 370 పేరుతో జమ్ముకశ్మీర్ ప్రజలను, దేశాన్ని తప్పుదోవ పట్టించాయని విమర్శించారు. 'భవిష్యత్తులో జమ్ముకశ్మీర్ విజయగాథ ప్రపంచానికి కేంద్రంగా నిలుస్తుంది. జమ్ముకశ్మీర్‌లోని సరస్సుల్లో ఎక్కడ చూసినా కమలం కనిపిస్తుంది. జమ్ముకశ్మీర్ క్రికెట్ లోగోపై కూడా కమలం గుర్తు ఉంది. బీజేపీ గుర్తు కూడా కమలమే. జమ్ముకశ్మీర్‌కు కమలంతో లోతైన అనుబంధం ఉండడం యాదృచ్చికమా లేక ప్రకృతి సంకేతమా?' అని మోదీ తెలిపారు.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్ అభివృద్ధిలో కొత్త శిఖరాలను తాకుతోందని ప్రధాని మోదీ తెలిపారు. ఆర్టికల్ 370 రద్దుపై కాంగ్రెస్ జమ్ముకశ్మీర్ ప్రజలను మాత్రమే కాదు, యావత్ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు. 'చలో ఇండియా' కార్యక్రమం కింద కనీసం 5 మంది కుటుంబ సభ్యులను భారత పర్యటనకు పంపాలని ప్రవాస భారతీయులను ప్రధాని కోరారు.
భారతదేశానికి జమ్ముకశ్మీర్ తలమానికమని ప్రధాని మోదీ అన్నారు. శ్రీనగర్ ఇప్పుడు దేశ పర్యాటక పరిశ్రమకు కేంద్రంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. శ్రీనగర్‌లోని అద్భుతమైన వ్యక్తుల మధ్య ఉన్నందుకు సంతోషిస్తున్నానని తెలిపారు. భూమిపై ఉన్న స్వర్గానికి(శ్రీనగర్‌ను ఉద్దేశించి) వచ్చిన అనుభూతి మాటల్లో చెప్పలేనిదని పేర్కొన్నారు.
శ్రీనగర్‌లోని బక్షి స్టేడియంలో 'విక్షిత్ భారత్ విక్షిత్ విక్షిత్ జమ్ముకశ్మీర్' కార్యక్రమంలో షోపియాన్, జమ్ము, కుప్వారా, శ్రీనగర్, గందర్‌బల్, బందీపురా, కథువాకు చెందిన ప్రభుత్వ పథకాలు పొందుతున్న లబ్ధిదారులతో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా సంభాషించారు.
శ్రీనగర్‌లోని బక్షి స్టేడియంలో ప్రధాని మోదీ రూ.6400 కోట్ల విలువైన 53 ప్రాజెక్ట్‌లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ పాల్గొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ శ్రీనగర్‌కు చేరుకున్నారు. 'విక్షిత్ భారత్, విక్షిత్ జమ్ముకశ్మీర్' పాల్గొనేందుకు గురువారం శ్రీనగర్‌కు వచ్చారు. రూ.6400 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్ట్‌లకు నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రధాని మోదీ కశ్మీర్ లోయలో పర్యటించడం ఇదే తొలిసారి.
PM Modi Kashmir Visit Live Updates : ప్రధాని నరేంద్ర మోదీ గురువారం కశ్మీర్ లోయలోని శ్రీనగర్‌లో పర్యటిస్తున్నారు. బక్షీ స్టేడియంలో నిర్వహించే భారీ కార్యక్రమంలో పాల్గొంటారు. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేకాధికారాలు కల్పించే అధికరణ-370రద్దు తర్వాత ప్రధాని మోదీ మొదటిసారి కశ్మీర్‌కు వెళ్లారు. 15రోజుల వ్యవధిలో జమ్ము కశ్మీర్‌లో పర్యటించటం ఇది రెండోసారి. గతనెల 20న జమ్ములో పర్యటించిన ప్రధాని పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేయటం సహా ప్రారంభోత్సవాలు చేశారు. ఆ తర్వాత జమ్ములో ఏర్పాటుచేసిన సభలో కూడా ప్రధాని పాల్గొన్నారు.
గురువారం కశ్మీర్ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ బక్షీ స్టేడియం నుంచి హజ్రత్‌బల్ దర్గా సమగ్రాభివృద్ధి ప్రాజెక్టుతోపాటు సోనామార్గ్ స్కీ-డ్రాగ్ లిఫ్ట్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు. హజ్రత్‌బల్ దర్గా ప్రాజెక్ట్‌ను తీర్థయాత్ర పునరుజ్జీవనం, ఆధ్యాత్మిక వృద్ధి డ్రైవ్‌లో భాగంగా అభివృద్ధి చేశారు. గందర్‌బల్ జిల్లా సోనామార్గ్‌లో స్కీ-డ్రాగ్ లిఫ్ట్‌ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. పర్యాటకులను ఆకర్షించటమే లక్ష్యంగా ఈప్రాజెక్టు చేపట్టారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులకోసం చలో ఇండియా ప్రచారంలో భాగంగా 42నూతన పర్యాటక కేంద్రాలను ఆవిష్కరించటం సహా 9 పర్యాటక ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. అంతేకాకుండా వెయ్యి మంది ఉద్యోగార్థులకు నియామకపత్రాలు కూడా అందజేయనున్నారు. కేంద్రం అమలు చేస్తున్న పథకాల ద్వారా ప్రయోజనం పొందిన లబ్ధిదారులతో జిల్లాల వారీగా ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటించనున్నారు. శ్రీనగర్ పర్యటనలో భాగంగా వ్యవసాయాభివృద్ధి కార్యక్రమంతోపాటు వ్యవసాయ పారిశ్రామికవేత్తల ప్రదర్శనను ప్రారంభిస్తారు.
ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో శ్రీనగర్‌లో భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు. డ్రోన్ల ద్వారా భద్రతను పర్యవేక్షిస్తున్నారు. నిఘా పెంపు చర్యల్లో భాగంగా వేర్వేరు ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. బ్యారికేడ్లను ఏర్పాటు చేయటంసహా వీవీఐపీల రాక నేపథ్యంలో ట్రాఫిక్‌ను దారి మళ్లించారు. బక్షీ స్టేడియానికి 2కిలోమీటర్ల పరిధిలో పూర్తి లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు.