PM Modi Inaugurates Nalanda New Campus : భారతదేశాన్ని ప్రపంచ విద్య, విజ్ఞాన కేంద్రంగా మార్చడమే తన లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన 10 రోజుల్లోనే నలంద యూనివర్సిటీని సందర్శించే అవకాశం తనకు లభించినందుకు సంతోషంగా ఉందన్నారు. బిహార్ రాజ్‌గిర్‌లోని నలంద యూనివర్శిటీ కొత్త క్యాంపస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బిహార్ గవర్నర్ రాజేంద్ర వీ ఆర్లేకర్, ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్, భారత విదేశాంగ మంత్రి ఎన్ జై శంకర్ పాల్గొన్నారు.
'దేశ గుర్తింపును ప్రపంచంలోనే అత్యుత్తమంగా ఆవిర్భవించడమే నా లక్ష్యం. ప్రముఖ నాలెడ్జ్ సెంటర్ అటల్ టింకరింగ్ ల్యాబ్‌లో కోటి మందికి పైగా విద్యార్థులు సరికొత్త సాంకేతికతను ఉపయోగించుకుని ప్రయోజనాలు పొందుతున్నారు. నలంద యూనివర్సిటీ పునర్నిర్మాణంతో దేశం స్వర్ణయుగాన్ని ప్రారంభించబోతోంది. ఈ కొత్త క్యాంపస్ ప్రపంచానికి భారతదేశాన్ని పరిచయం చేస్తుంది. నలంద అనేది కేవలం పేరు మాత్రమే కాదు. ఒక గుర్తింపు, గౌరవం. నలంద ఒక విలువైన మంత్రం. అగ్ని పుస్తకాలను కాల్చగలదు గానీ జ్ఞానాన్ని నాశనం చేయలేదు. నలంద కొత్త క్యాంపస్ దేశ సామర్థ్యాన్ని ప్రపంచానికి ఉదాహరణగా చూపుతుంది. బలమైన మానవ విలువలపై ఆధారపడిన దేశాలకు గతాన్ని ఎలా పునరుద్ధరించాలో, మంచి భవిష్యత్తుకు పునాది ఎలా వేయాలో చూపుతుంది. గత 10 ఏళ్లలో దేశంలో సగటున ప్రతి వారం ఒక విశ్వవిద్యాలయం నిర్మితమవుతోంది. ప్రతిరోజూ సగటున రెండు కొత్త కళాశాలలు నిర్మితవుతున్నాయి. దేశంలో ప్రస్తుతం 23 ఐఐటీలు ఉన్నాయి. 10 ఏళ్ల కిందట 13 మాత్రమే ఉండేవి.' అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.