PM Modi Comments On Farmers :రైతులు సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఏ అవకాశాన్ని వదిలిపెట్టడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తమ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 60 వేలకు పైగా అమృత్ సరోవర్లను నిర్మించిందని తెలిపారు. దీనివల్ల రైతులకు ప్రయోజనం చేకూరడమే కాకుండా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని మోదీ చెప్పారు. ఈ దేశంలోని చిన్న సన్నకారు రైతులకు కూడా ఆధునిక సాంకేతికతను అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ మేరకు గుజరాత్ సహకార పాల మార్కెటింగ్ ఫెడరేషన్-GCMMF స్వర్ణోత్సవాల అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో పశువుల పెంపకందారులు, రైతులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు.
"చిన్న రైతుల జీవితాన్ని మెరుగుపరచడం, పశుపోషణ పరిధిని పెంచడం, జంతువుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, గ్రామాల్లో పశుపోషణతో పాటు పిసికల్చర్, తేనెటీగల పెంపకాన్ని ప్రోత్సహించడంపైనే మా దృష్టి ఉంది. అందుకే మొట్ట మొదటిసారిగా మేము పశువుల, చేపల పెంపకందారులకు కిసాన్ క్రెడిట్ కార్డు సదుపాయాన్ని అందించాము. వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు మా ప్రభుత్వం రైతులకు ఆధునిక విత్తనాలను అందించింది."
-- నరేంద్ర మోదీ, భారత ప్రధాని
'అమూల్ ఆ స్థాయికి చేరుకోవాలి'
అమూల్ బ్రాండ్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తుల కంపెనీగా మార్చాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశంలో పాడి పరిశ్రమ వేగంగా వృద్ధి చెందుతోందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పాడి పరిశ్రమ వృద్ధి రేటు రెండు శాతం ఉండగా దేశంలో ఆరు శాతమని చెప్పారు. ప్రస్తుతం 8వ స్థానంలో ఉన్న గుజరాత్ సహకార పాల మార్కెటింగ్ ఫెడరేషన్ ప్రపంచంలో నెంబర్ వన్ స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు. అందుకు కేంద్రప్రభుత్వం అండగా ఉంటుందని, ఇది మోదీ గ్యారెంటీ అని ప్రధాని చెప్పారు. దేశంలో పాడి పరిశ్రమ మొత్తం టర్నోవర్ రూ.10 లక్షల కోట్లు అని వరి, గోధుమ, చెరకు ఉత్పత్తులు మొత్తం కలిపినా అంతకాదని ప్రధాని మోదీ వెల్లడించారు.