PM Modi Comments :జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదం చివరి శ్వాస తీసుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. జమ్ముకశ్మీర్ లాంటి అందమైన ప్రాంతాన్ని వారసత్వ రాజకీయాలు దెబ్బతీశాయని విమర్శించారు. అందుకే పరివారవాదుల రాజకీయాలను ఎదుర్కోవడానికి తమ ప్రభుత్వం కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించిందని తెలిపారు. జమ్ముకశ్మీర్‌లో అప్రకటిత కర్ఫ్యూలు ఉండవని, ఆ రోజులు ముగిశాయని చెప్పుకొచ్చారు. జమ్ముకశ్మీర్‌లోని దోడా జిల్లాలో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రధాని మోదీ శనివారం ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారసత్వ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
'జమ్ముకశ్మీర్ విదేశీ శక్తులకు లక్ష్యంగా మారింది'
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జమ్ముకశ్మీర్ విదేశీ శక్తుల లక్ష్యంగా మారిందని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. ఆ తర్వాత పరివారవాదులు ఈ ప్రాంతాన్ని వంచన చేయడం ప్రారంభించారని విమర్శించారు. గతంలో జమ్ముకశ్మీర్‌లో పరివారవాదులు తమ పిల్లలను ప్రొజెక్ట్ చేసి కొత్త నాయకత్వాన్ని ఎదగనివ్వలేదని ఆరోపించారు. అందుకే తాము కేంద్రంలో 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే యువ నాయకత్వాన్ని ఏర్పాటు చేయడంపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు.
"త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు జమ్ముకశ్మీర్ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మీరు విశ్వసించిన రాజకీయ పార్టీలు మీ పిల్లల భవిష్యత్తును పట్టించుకోలేదు. వారు వారి వారసుల భవిష్యత్తుపైనే దృష్టి పెట్టాయి. జమ్ముకశ్మీర్ యువత ఉగ్రవాదంతో బాధపడింది. ఈ వారసత్వ పార్టీలు మిమ్మల్ని తప్పుదోవ పట్టించి, వేడుక చూశాయి. జమ్ముకశ్మీర్ ప్రస్తుతం రాళ్లదాడులు లేవు. గతంలో ఉగ్రమూకలు విసిరిన రాళ్లు కొత్త జమ్ముకశ్మీర్‌ను సృష్టించడానికి ఉపయోగించాం." అని నరేంద్ర మోదీ వెల్లడించారు.