Phase 5 Lok Sabha Polls 2024 :లోక్‌సభ ఎన్నికల ఐదో విడత పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. సోమవారం 6 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఐదో విడతలో ఉత్తర్‌ప్రదేశ్‌లో 14 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. మహారాష్ట్రలో 13, బిహార్‌లో 5, జమ్ముకశ్మీర్, లద్ధాఖ్‌లో చెరొకటి, ఝార్ఖండ్ 3, ఒడిశా 5, బంగాల్‌లో 7 లోక్‌సభ స్థానాల్లో ఓటింగ్ జరగనుంది. ఈ నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న 695మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు.
ప్రముఖులు వీరే!
ఐదో విడతలో పలువురు కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, బీజేపీ అగ్రనాయకులు రాజ్‌నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, రాజీవ్ ప్రతాప్ రూడీ, పీయూష్ గోయల్, LJP అధినేత చిరాగ్ పాసవాన్ సహా పలువురు అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రాహుల్ గాంధీ ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు కంచుకోటగా భావించే రాయ్‌బరేలీలో పోటీ చేస్తున్నారు. 1999 నుంచి అక్కడ హస్తం పార్టీ అభ్యర్థులే విజయం సాధిస్తూ వచ్చారు. 2004 నుంచి 2024 వరకూ రాయ్‌బరేలీ నుంచి ప్రాతినిథ్యం వహించిన సోనియాగాంధీ ఈసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఫలితంగా ఆ స్థానంలో ఆమె కుమారుడు రాహుల్ పోటీకి దిగారు. వయనాడ్ సిట్టింగ్ ఎంపీ అయిన రాహుల్ అక్కడి నుంచి రెండోసారి బరిలో ఉన్నారు.
బీజేపీ x కాంగ్రెస్- ఈసారి అమేఠీ ఎవరిది?
బీజేపీ సీనియర్ నేత, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ లఖ్‌నవూ నుంచి మూడోసారి పోటీ చేస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లో విజయభేరి మోగించారు. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన రవిదాస్ మెహ్‌రోత్రా రాజ్‌నాథ్‌తో తలపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మరో కంచుకోట అయిన అమేఠీని 2019 ఎన్నికల్లో బద్ధలుకొట్టిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రెండోసారి అక్కడి నుంచి పోటీలో ఉన్నారు. గాంధీ కుటుంబానికి సన్నిహితునిగా ముద్రపడిన కిషోరీలాల్ శర్మ ఈసారి కాంగ్రెస్ తరఫున అమేఠీలో పోటీ చేస్తున్నారు. BSP నుంచి నన్హే సింగ్ చౌహాన్ బరిలో ఉన్నారు.
ఆరోపణలు ఎన్నున్నా- అక్కడ బ్రిజ్భూషన్దే పట్టు?
ఉత్తర్‌ప్రదేశ్‌లోని కైసర్‌గంజ్‌లో ఈసారి WFI మాజీ చీఫ్ బ్రిజ్‌భూషణ్ కుమారుడు కరణ్ భూషణ్ బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లో WFI మాజీ చీఫ్ బ్రిజ్‌భూషణ్ విజయం సాధించినప్పటికీ లైంగిక వేధింపుల ఆరోపణలు రావటం వల్ల బీజేపీ ఆయన్ను పక్కనపెట్టింది. SP తరఫున రామ్‌భగత్, BSP నుంచి నరేంద్రపాండే బరిలో ఉన్నారు. ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ సీఎం లాలుప్రసాద్ కుమార్తె రోహిణి ఆచార్య సరన్ లోక్‌సభ స్థానం నుంచి బరిలో ఉన్నారు. 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలుపొందిన బీజేపీ అభ్యర్థి రాజీవ్ ప్రతాప్ రూడీతో ఆమె తలపడుతున్నారు. లోక్ జనశక్తి పార్టీ-LJP అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ హాజిపుర్ నుంచి బరిలోకి దిగారు. గత రెండు ఎన్నికల్లో ఇక్కడ LJP అభ్యర్థులే విజయభేరీ మోగించారు. RJDనుంచి చంద్రరామ్ చిరాగ్‌తో పోటీపడుతున్నారు.