How To Make Mumbai Street Style Pav Bhaji : పావ్భాజీ.. నోరూరించే స్ట్రీట్ ఫుడ్లో ఇదీ ఒకటి. పావ్ అంటే బన్ను, భాజీ అంటే కూరగాయలు. దేశంలో ఎక్కడికి వెళ్లినా కనిపిస్తుంటుంది ఈ వంటకం. ఇక ముంబయిలో అయితే పావ్భాజీ చాలా ఫేమస్. ముఖ్యంగా వర్షాకాలంలో చిన్న చిన్నగా చినుకులు పడుతుంటే.. వేడి వేడిగా పావ్భాజీ తింటుంటే.. ఆహా.. ఎంత బాగుంటుందో! అయితే, పావ్భాజీ తినడానికి ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఈజీగా.. అదీ ముంబయి స్టైల్లో పావ్భాజీని ప్రిపేర్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు.. తయారీ విధానం ఈ స్టోరీలో చూద్దాం..
పావ్భాజీ తయారీకి కావాల్సినవి :
- బన్నులు - 2
- బటర్ - అర కప్పు
- నూనె - 2 టేబుల్ స్పూన్లు
- ఉల్లిపాయ ముక్కలు - ముప్పావు కప్పు
- క్యాప్సికం తరుగు - ముప్పావు కప్పు
- పచ్చి బఠాణీలు - ముప్పావు కప్పు
- టమాట ముక్కలు - అర కప్పు
- ఉడికించిన బంగాళ దుంప - 1(పెద్ద సైజ్లో ఉండేది)
- అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
- కసూరి మేథి - 1 టీస్పూన్
- పావ్భాజీ మసాలా పొడి - 2 టీస్పూన్లు
- ఉప్పు - రుచికి సరిపడా
- కాశ్మీరీ కారం - 1 టీస్పూన్
- కొత్తిమీర తరుగు - 2 టేబుల్ స్పూన్లు
- నిమ్మకాయ - 1
తయారీ విధానం :
- ముందుగా స్టౌ మీద పాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల చొప్పున ఆయిల్, బటర్ వేసుకొని కరిగించుకోవాలి. ఇక్కడ బటర్ ప్లేస్లో నెయ్యి కూడా వాడుకోవచ్చు. తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లి, క్యాప్సికం, పచ్చి బఠాణీలు వేసుకొని 3 నుంచి 4 నిమిషాల పాటు వేయించుకోవాలి. అంటే.. ఆనియన్స్ పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి.
- అయితే, ఇక్కడ మీరు తాజాగా ఉండే పచ్చి బఠాణీలు యూజ్ చేస్తున్నట్లయితే వాటిని అరగంటపాటు వేడి నీటిలో నానబెట్టుకొని వేసుకోండి. అలా చేయడం ద్వారా బఠాణీలు త్వరగా ఉడుకుతాయి.
- ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరో నిమిషం పాటు వేయించుకోవాలి. ఆపై కట్ చేసి పెట్టుకున్న టమాట ముక్కలను వేసి మిశ్రమం పూర్తిగా ఉడికే వరకు కుక్ చేసుకోవాలి.
క్రిస్పీ పొటాటో లాలీపాప్స్- ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తినడం పక్కా!
- అలా ఉడికించుకున్నాక అందులో రుచికి సరిపడా ఉప్పు, పావ్భాజీ మసాలా, కసూరి మేథి, కాశ్మీరీ కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అనంతరం ఉడికించుకున్న బంగాళదుంప(Potato) ముక్కలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
- తర్వాత పప్పు గుత్తి(మేషర్) తీసుకొని ఆ మిశ్రమాన్ని బాగా మెత్తగా మాష్ చేసుకోవాలి. ఎంత బాగా మాష్ చేసుకుంటే భాజీ అంత క్రీమీగా వస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
- ఆ విధంగా మాష్ చేసుకున్నాక అందులో పావు లీటర్ వాటర్ యాడ్ చేసుకొని భాజీ క్రీమీగా వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. అయితే, భాజీ మరీ ముద్దగా మారితే మాత్రం మరికొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి.
- తర్వాత కొత్తిమీర తరుగు, కాస్త బటర్ వేసి మధ్య మధ్యలో కలియతిప్పుతూ, మెదుపుతూ భాజీ దగ్గర పడే దాకా ఉడికించుకొని ఆపై దింపేసుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని బటర్, పావు చెంచా పావ్భాజీ మసాలా వేసి బన్నులను సగానికి కట్ చేసి రెండు వైపులా వేయించుకోవాలి.
- అప్పుడు భాజీతో పాటు.. పావ్లను ప్లేట్లోకి తీసుకొని నిమ్మ చెక్క, ఉల్లిపాయ ముక్కలతో వేడి వేడిగా వడ్డించుకుని తినండి. అంతే.. ఘుమఘుమలాడే ముంబై స్ట్రీట్ స్టైల్ పావ్భాజీ రెడీ!
సాయంత్రం వేళ - కరకరలాడే "చైనీస్ భేల్ పూరి" - నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు! పైగా టేస్ట్ సూపర్!