Passengers Breathing Problems In Flight : ముంబయి నుంచి మారిషస్‌కు వెళ్లాల్సిన ఎయిర్ మారిషస్‌కు చెందిన ఓ విమానంలో ప్రయాణికులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విమాన ఇంజిన్‌లో సాంకేతిక సమస్యలు ఏర్పడటం, ఏసీలు పనిచేయకపోవడం వల్ల ఓ 78 ఏళ్ల ప్రయాణికుడితోపాటు పలువురు శిశువులు ఇబ్బందిపడ్డారు. ప్రస్తుతం ఈ విమానాన్ని రద్దు చేశారు అధికారులు.
అసలేం జరిగిందంటే?
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ మారిషస్‌కు చెందిన MK749 విమానం ముంబయి నుంచి శనివారం ఉదయం 4.30 గంటలకు బయల్దేరాల్సి ఉంది. తెల్లవారుజామున 3.45 గంటలకే ప్రయాణికులంతా విమానం ఎక్కారు. అయితే టేకాఫ్ చేస్తుండగా ఇంజిన్‌లో సమస్య ఏర్పడింది. దీంతో విమానాన్ని రన్‌వేపైనే ఉంచారు. కానీ ప్రయాణికులను మాత్రం కిందకు దిగేందుకు అనుమతించలేదు. దాదాపు 5 గంటలపాటు వారు అందులోనే ఉండాల్సి వచ్చింది.
వెంటనే కిందకు దించి చికిత్స
అదే సమయంలో విమానంలో ఏసీలు పనిచేయకపోవడం వల్ల పలువురు శిశువులు సహా 78 ఏళ్ల వ్యక్తి ఊపిరి తీసుకువడంలో తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. వారు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటం వల్ల వెంటనే వారిని కిందకు దించి చికిత్స అందించినట్లు తోటి ప్రయాణికులు మీడియాకు తెలిపారు.
అయితే ఇంజిన్ లోపాన్ని సరిచేయడానికి విమానయాన సంస్థ విడిభాగాలతో ఇంజనీర్లను పిలిపించింది. కానీ వారు ఇంజిన్‌లో లోపాన్ని సరిదిద్దలేకపోయారు. దీంతో ఉదయం 10 గంటలకు విమానాన్ని రద్దు చేసినట్లు కెప్టెన్ ప్రకటించారు. ప్రస్తుతం ప్రయాణికులకు అవసరమైన ఇతర ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. అయితే ఈ ఘటనపై ఎయిర్‌పోర్టు అధికారులు గానీ, ఎయిర్ మారిషస్ గానీ ఎలాంటి ప్రకటన చేయలేదు.
గగనతలంలో ఊడిన విమానం డోర్
ఇటీవలే గగనతలంలో ఓ విమానానికి అత్యవసర పరిస్థితి ఏర్పడింది. టేకాఫ్ అయిన వెంటనే బోయింగ్ విమానం డోర్ ఊడిపోయింది. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటనతో విమాన సిబ్బంది ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం అమెరికాలోని పోర్ట్‌లాండ్ నుంచి ఒంటారియోకు బయలుదేరిన సమయంలో 16 వేల అడుగుల ఎత్తులో ఈ ప్రమాదం జరిగింది. ఊడిన డోర్ పక్కనే ప్రయాణికులు సీట్లు ఉండగా కొందరి ఫోన్లు బయటకు ఎగిరి పడ్డాయి. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.
టేకాఫ్ సమయంలో విమాన ప్రమాదం- రంధ్రంతో గంటసేపు గాల్లోనే ఫ్లైట్
విమానం డోర్ ఊడిన ఘటన- DGCA అలర్ట్- ఎమర్జెన్సీ డోర్లు తనిఖీ చేయాలని ఆదేశాలు!