CM Revanth Delhi Tour : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఉదయం దిల్లీ వెళ్లనున్నారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో హస్తినకు బయలు దేరే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. దిల్లీలో ఆయన ఏఐసీసీ పెద్దలతో సమావేశమై ప్రధానంగా మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ప్రచార సరళిపై చర్చించనున్నారు. వీటితో పాటు తెలంగాణలో ప్రస్తుత రాజకీయాలపై కూడా చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.
సమావేశంలో మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వ్యూహంపై చర్చించనున్నారు. దీంతో ఆ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రచారంపై కూడా స్పష్టత రానుంది. ఇప్పటికే ఓసారి ముంబయిలో తెలుగువారు అధికంగా ఉండే ప్రాంతాల్లో ముఖ్యమంత్రి ప్రచారం నిర్వహించారు. రాబోయే రోజుల్లో మరో మూడు, నాలుగుసార్లు ఆ రాష్ట్రంలో ప్రచారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. తెలుగు మాట్లాడే ప్రాంతాలపై తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఇప్పటికే దృష్టి పెట్టారు.
పనిలో పనిగా తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులను ఆయన హైకమాండ్‌కు వివరిస్తారని పార్టీ ప్రతినిధులు తెలిపారు. మరోవైపు దిల్లీలో మధ్యాహ్నం పార్టీ పెద్దలతో భేటీ అనంతరం సాయంత్రం మీడియాతో మాట్లాడే అవకాశం కూడా ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు ఈనెల 20న జరగనుండగా ఫలితాలు ఈనెల 23న ప్రకటించనున్నారు. ప్రచారానికి వారం రోజుల సమయమే ఉన్నందున ఈలోగా మహారాష్ట్రలో 3,4 చోట్ల రేవంత్ రెడ్డి ప్రచారం ఉండే అవకాశముంది.
"ప్రధాని అబద్ధాలు చెప్పడం మానుకోకపోతే - మేం నిజాలు చెబుతూనే ఉంటాం"