Starlink Launch In India : ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు ఇండియాలో ప్రారంభమయ్యేందుకు మార్గం సుగమం అవుతోంది. ఇప్పటికే భారత్ టెలికాం నిబంధనలకు సూత్రప్రాయంగా స్టార్‌లింక్ అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. త్వరలోనే స్టార్‌లింక్ సంస్థ బ్రాడ్ బ్యాండ్ సేవలకు అనుమతులు పొందే అవకాశం కూడా ఉన్నట్లు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ ప్రైవేట్ టెలికాం కంపెనీలకు గట్టిపోటీ ఎదురయ్యే అవకాశం ఉంది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచిన నేపథ్యంలో, ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్ లింక్ సేవలు ఇండియాలో మొదలు పెట్టేందుకు సర్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇండియాలో బ్రాడ్‌బ్యాండ్ సేవలను ప్రారంభించేందుకు ముందుగా లైసెన్స్ పొందాలి. ఇందుకుగాను కొన్ని నిబంధనలకు స్టార్‌లింక్ అంగీకారం తెలపాల్సి ఉంటుంది. వాస్తవానికి మన దేశంలోని టెలికాం సంస్థలు తాము సేకరించిన డేటాను భద్రతా నియమాలకు లోబడి భారత్‌లోనే భద్రపర్చాల్సి ఉంటుంది. అంతేకాదు అవసరమైనప్పుడు ఆ డేటాను దర్యాప్తు సంస్థలు పొందేందుకు వీలు కల్పించాలి కూడా. ప్రభుత్వం నుంచి అనుమతులు పొందాలంటే, ఈ నియమాలు కచ్చితంగా పాటించాల్సిందే. అందువల్ల వీటికి స్టార్‌లింక్ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్టు డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యునికేషన్ తెలిపింది. దీనితో స్టార్‌లింక్ సంస్థ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవల లైసెన్స్ పొందేందుకు అడుగులు పడినట్లు తెలుస్తోంది. ఐతే ప్రభుత్వ నియమ, నిబంధనలకు అంగీకారం తెలుపుతూ స్టార్‌లింక్ ఇప్పటి వరకు ఎటువంటి ఒప్పంద పత్రాన్ని సమర్పించలేదని తెలుస్తోంది.
త్వరలోనే బ్రాడ్‌బ్యాండ్ సేవలు!
2022లో గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యునికేషన్ బై శాటిలైట్ సర్వీస్- GMPCS లైసెన్స్ కోసం స్టార్ లింక్ దరఖాస్తు చేసుకుంది. అనంతరం ఇండియన్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్‌కు అనుమతుల కోసం అప్లై చేసింది. తాజాగా ఈ ప్రక్రియ ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గతవారం ఇన్-స్పేస్ ఛైర్మన్ పవన్ కుమార్ గోయంకా స్టార్‌లింక్ నుంచి అదనపు వివరాలు కోరినట్లు సమాచారం. భారత్ టెలికమ్యునికేషన్ నియమాలకు సూత్రాప్రాయంగా స్టార్‌లింక్ ఒప్పుకోవడం వల్ల టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ ఉపగ్రహ సేవలకు స్పెక్ట్రామ్‌ను కేటాయించటం, వాటి ధరలను ఖరారు చేయడం కోసం వాటాదారులతో సంప్రదిస్తున్నట్లు సమాచారం. ధర, స్పెక్ట్రమ్ కేటాయింపుపై ప్రభుత్వం నియమాలు తయారు చేసిన తర్వాత, దేశంలో శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ మొత్తం ట్రాయ్ తన సిఫార్సులను విడుదల చేసిన తర్వాత మాత్రమే ప్రారంభమవుతుంది. ఈ ప్రక్రియను డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
పోటీ మామూలుగా ఉండదుగా!
స్టార్‌లింక్‌కు దేశీయంగా అన్ని అనుమతులు లభించి బ్రాడ్‌బ్యాండ్ సేవలను ప్రారంభిస్తే, దేశీయంగా టెలికాం సేవలందిస్తున్న దిగ్గజ సంస్థలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు తీవ్రమైన పోటీ ఎదుర్కొనే అవకాశం ఉంది. గతవారం జరిగిన ఓ సమావేశంలో ఈ మూడు భారతీయ ప్రైవేట్ టెలికాం కంపెనీల ప్రతినిధులు శాటిలైట్ బ్రాడ్ బ్యాండ్ సేవలను పట్టణ ప్రాంతాల్లో అందించాలని చూడటంపై ఆందోళన వ్యక్తం చేశారు. టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు వేలం వేసిన శాటిలైట్ స్పెక్ట్రమ్‌ను మాత్రమే పట్టణ ప్రాంతాల్లో సేవలకు ఉపయోగించాలన్నారు. దీనిపై స్పందించిన స్టార్‌లింక్ ఇండియా ప్రతినిధి టెలికాం సేవలు, శాటిలైట్ సేవలు రెండూ ప్రాథమికంగా భిన్నమైనవని, ఆ రెండింటిని పోల్చి చూడకూడదని అన్నారు.