Fake Medicine in Hyderabad : కల్తీ కాటు బారిన పడితే ఆరోగ్యానికి పెనుముప్పు. మరి ఆ ఆరోగ్యాన్ని కాపాడే ఔషధాలే నకిలీ, నాసిరకమయితే. ఇవి పుకార్లు కాదు చేదునిజం. సరిహద్దులు దాటి హైదరాబాద్ నగరానికి నకిలీ ఔషధాలు తరలివస్తున్నాయి. కొన్ని ముఠాలు గుట్టుగా కొన్ని మెడికల్ దుకాణాలతో సంబంధాలు పెట్టుకొని నకిలీ మందులు అమ్ముతున్నారు. ముఖ్యంగా క్యాన్సర్, ఇతర క్లిష్టమైన రోగాలకు సంబంధించి ఖరీదైన మందులను పోలిన నకిలీ మందులు తెచ్చి అమ్ముతున్నారు.
గుట్టుగా నకిలీ ఔషధాల విక్రయాలు : షీట్‌పై పేర్లలో అక్షరాలను అటూ ఇటూ చేయడం, ప్యాకింగ్‌లో తేడా కన్పించకపోయేసరికి రోగులు గుర్తుపట్టడం లేదు. పెద్ద మొత్తంలో మందులు, ఇంజక్షన్ల ప్యాకెట్లు కొనేటప్పుడు వాటిలో ఒకటి రెండు నకిలీవి కలిపి అమ్మేస్తున్నారు. నగరంలో ఔషధ నియంత్రణ శాఖ ఇటీవల 8 కేసులు నమోదు చేసి, పోలీసుల సహకారంతో కొంత మందిని అరెస్ట్ చేసింది.
గోలీల్లో ఔషధానికి బదులు సుద్ద పిండి : నకిలీ ఔషధాల కారణంగా రోగాలు మానక పోగా సమస్య మరింత పెరుగుతోంది. మందుల విషయంలో ఎంతో కొంత తెలిసి ఉంటే తప్ప వీటిని గుర్తించడం కష్టం అవుతోంది. కొన్ని ముఠాలు గోలీల్లో ఔషధానికి బదులు సుద్ద పిండి పెట్టి ప్యాక్ చేసి అమ్ముతున్నారు. గుజరాత్, పుణేలాంటి చోట్ల వీటిని తయారు చేసి, దేశంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. శివార్లు, బస్తీల్లోని కొన్ని మెడికల్ షాపులను ఎంచుకొని ఈ ముఠాలు అక్రమ దందా చేస్తున్నాయి. దుకాణదారులకు భారీ ఎత్తున కమీషన్లు ఇవ్వడంతో ఈ వ్యాపారంలో దిగుతున్నారు. దీంతో నోట్లో వేసుకున్న మందు, ఒంటికి రాసుకున్న ఆయింట్‌మెంట్ పని చేస్తోందో లేదోననే ప్రజలు ఆందోళన పడుతున్నారు.
తస్మాత్ జాగ్రత్త - గుర్తిస్తే ఫిర్యాదు చేయండి : ఈ తరహా మోసాలపై ఔషధ నియంత్రణ శాఖ కొరఢా ఝుళిపిస్తోంది. ఇప్పటి వరకు 500 కేసులు నమోదు చేసింది. నకిలీ మందులతో పాటు మత్తు మందుల అమ్మకం, లైసెన్సు లేకుండా మందుల విక్రయాలు, నాణ్యతలేని వాటిని అమ్మడం, అధిక ధరలు వంటి మోసాలపై పోలీసులు కేసు నమోదు చేసి కొంత మందిని అరెస్ట్ చేశారు. నగరంలో వేల సంఖ్యలో పెద్ద, చిన్న నర్సింగ్ హోంలు, వాటికి అనుసంధానంగా మందుల దుకాణాలు ఉన్నాయి. అన్నింటిలో తనిఖీలు చేయడం అధికారులకు కష్టం అవుతుంది.
మోసాలపై డీసీఏ అధికారుల కొరఢా : ఈ నేపథ్యంలో వినియోగదారులే ముందుకొచ్చి మోసాలపై సమాచారం ఇవ్వాలని డీసీఏ అధికారులు కోరుతున్నారు. ఔషధాలు కొన్న తర్వాత డాక్టర్లకు చూపించి వాడాలని సూచించారు. మందుల షీట్లపై బ్రాండ్ పేరు, తయారీ తేదీ, చిరునామా అన్ని ప్యాకెట్లపై ఒకేలా ఉన్నాయా లేదా పరిశీలించాలన్నారు. అనుమానం వస్తే డీసీఏ అధికారులను సంప్రదించాలని తెలిపారు. షాపులకు అనుమతులు లేకున్నా, నకిలీ ఔషధాలను గుర్తించినా అక్రమ నర్సింగ్ హోంలు నడుపుతున్నా డీసీఏ టోల్‌ఫ్రీ 1800-599-6969 ద్వారా తమ దృష్టికి తేవాలని డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్‌రెడ్డి సూచించారు. సమాచారం ఇచ్చినవారి వివరాలు గుట్టుగా ఉంచుతామని అధికారులు తెలిపారు.
చాక్‌పీస్ పౌడర్, మొక్కజొన్న పిండి కాదేదీ ఔషధానికి అనర్హం! - నకిలీ మందుల దందా గుట్టురట్టు