తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Jun 13, 2024, 7:25 AM IST

ETV Bharat / bharat

వర్షాకాల సమావేశాల్లోనే కేంద్ర బడ్జెట్- నిర్మలా సీతారామన్ సరికొత్త రికార్డ్! - parliament session

Parliament Session Schedule 2024 : 18వ లోక్‌సభ తొలి సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. జూన్​ 24 నుంచి జులై 3 వరకు జరగనున్నాయి. అయితే ఈ సమావేశాల్లో బడ్జెట్​ ప్రవేశపెట్టే సూచనలు కనిపించడం లేదు. వర్షాకాల సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్​ను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశాల్లోనే నిర్మలా సీతారామన్ కొత్త రికార్డ్​ను సృష్టించనున్నారు.

Parliament Session Schedule 2024
Parliament Session Schedule 2024 (ANI)

Parliament Session Schedule 2024 :18వ లోక్‌సభ తొలి సమావేశాలు ఈనెల 24 నుంచి జులై 3వ వరకు జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు వెల్లడించారు.అయితే కేంద్రం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టే సూచనలు కనిపించడంలేదు. తొలి విడత సమావేశంలో సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్‌ ఎంపికకు తీసుకునే సమయాన్ని మినహాయిస్తే మిగిలినవి ఐదు రోజులే ఉంటాయి.

ఈ స్వల్పకాలంలో బడ్జెట్‌ ప్రవేశపెట్టి, దానిపై చర్చించి, ఆమోదించడం సాధ్యంకాదు. అందువల్ల జులై మూడోవారంలో జరిగే వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్నికల సంవత్సరం కావడం వల్ల ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి 1న ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. కొత్తసభ ఏర్పడిన తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టాల్సి ఉంది.

ఏడోసారి బడ్జెట్
ఈ సమావేశాల్లో నిర్మలా సీతారామన్ వరసగా ఏడుసార్లు బడ్జెట్‌ సమర్పించిన ఘనత సాధించనున్నారు. ఇప్పటివరకు మొరార్జీ దేశాయ్‌ వరసగా ఆరుసార్లు బడ్జెట్‌ సమర్పించారు. గత లోక్‌సభ ఏర్పడినప్పుడు 2019 జూన్‌ 17 నుంచి జులై 26 వరకే తొలి సమావేశాలు నిర్వహించాలనుకున్నప్పటికీ ఆగస్టు 7 వరకు పొడిగించి, జులై 5న పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టారు.

సభ్యుల ప్రమాణాలకు మూడు రోజులు
కొత్త లోక్‌సభ సభ్యుల ప్రమాణ కార్యక్రమం ఈసారి మూడు రోజుల పాటు కొనసాగనుంది. ఆ తర్వాత స్పీకర్‌ ఎంపిక ఉంటుంది. 27 నుంచి రాజ్యసభ 264వ సెషన్‌ ప్రారంభమవుతుంది. ఆరోజు పార్లమెంటు ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగిస్తారు. ఈ ప్రసంగంలో రాబోయే ఐదేళ్లలో కొత్త ప్రభుత్వం చేపట్టబోయే రోడ్ మ్యాప్​ను వివరించే అవకాశం ఉంది. రాష్ట్రపతి అనంతరం ప్రధాని మోదీ కేంద్ర కేబినెట్‌ను పార్లమెంటుకు పరిచయం చేస్తారు. అనంతరం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, దానికి ప్రధాని సమాధానం వంటివి ఉంటాయి.

ప్రోటెం స్పీకర్?
ఏడుసార్లు ఎంపీగా ఎన్నికైన మధ్యప్రదేశ్‌ టీకంగఢ్‌ ఎంపీ, ప్రస్తుత కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి వీరేంద్రకుమార్‌ గతసారి ప్రోటెం స్పీకర్‌గా వ్యవహరించి సభ్యులతో ప్రమాణం చేయించారు. ఇప్పుడు ఆయన కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టినందున ప్రోటెం స్పీకర్‌గా వ్యవహరించే అవకాశం లేదు. ఏడుసార్లు లోక్‌సభకు ఎన్నికైన కేరళ ఎంపీ, కాంగ్రెస్‌ సభ్యుడు కొడిక్కున్నీల్‌ సురేశ్‌ ప్రోటెం స్పీకర్‌ అయ్యే అవకాశం ఉంది. కాని పక్షంలో కటక్‌ నుంచి వరుసగా ఆరుసార్లు ఎంపికైన బీజేపీ సభ్యుడు భర్తృహరి మహతాబ్‌ ఆ బాధ్యతలు చేపట్టే వీలుంది.

'ఎన్నికల్లో ఆశించిన మేర రాణించలేదు- ఆత్మపరిశీలన చేసుకుంటున్నాం' - sitaram yechury interview

'వయనాడ్‌కు గుడ్‌ బై- రాయ్​బరేలీకి జై!' రాహుల్‌ నిర్ణయం అదేనా? - Lok Sabha election Results 2024

ABOUT THE AUTHOR

...view details