తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బడ్జెట్ సమావేశాలకు అంతా రెడీ! విపక్షాలకు కేంద్రం సలహా- కీలక ప్రకటనలు ఉంటాయా?

Parliament Budget Session 2024 : లోక్​సభ ఎన్నికలకు ముందు జరిగే చివరి పార్లమెంట్ సమావేశాలకు అధికార, విపక్షాలు సిద్ధమయ్యాయి. ఈ సమావేశాల్లో కేంద్రం మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. 17వ లోక్​సభకు చివరి సమావేశాలు ఇవే కాబట్టి విపక్షాలు సభలోకి ప్లకార్డులు తీసుకురావొద్దని ప్రభుత్వం సూచించింది.

Parliament Budget Session 2024
Parliament Budget Session 2024

By ETV Bharat Telugu Team

Published : Jan 30, 2024, 4:26 PM IST

Updated : Jan 30, 2024, 7:41 PM IST

Parliament Budget Session 2024 :సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగే చివరి పార్లమెంట్ సమావేశాలకు రంగం సిద్ధమైంది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు జరిగే బడ్జెట్ సమావేశాల కోసం అధికార, విపక్షాలు సిద్ధమయ్యాయి. ఎన్నికలకు ముందు మోదీ సర్కారు ఎలాంటి మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెడుతుందనేది ఆసక్తికరంగా మారింది. సంచలనాల విషయం ఎలా ఉన్నా మధ్యంతర బడ్జెట్ సంస్కరణాత్మకంగానే ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. బడ్జెట్ సమావేశాల్లో ఏ అంశంపైనైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగానే ఉందని అఖిలపక్ష సమావేశంలో కేంద్రం స్పష్టం చేయగా- దేశంలో అప్రకటిత నియంతృత్వం నడుస్తోందని విపక్షాలు ఎదురుదాడికి దిగాయి.

ఈ ఏడాది లోక్​సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్​ ప్రవేశపెట్టదు. కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు అవసరమయ్యే వ్యయాలను దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్ పెడతారు. ఎన్నికల తర్వాత ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతుంది. మధ్యంతర బడ్జెట్​లో కొత్త పథకాలు, పన్నుల్లో మార్పులు ఉండకపోవచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. అయితే, మధ్యంతర బడ్జెట్​లోనూ కీలక ప్రకటనలు వస్తున్న నేపథ్యంలో నిర్మలమ్మ పద్దుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈసారి ప్రవేశపెట్టే బడ్జెట్ నిర్మలా సీతారామన్​కు ఆరోది కానుంది.

మధ్యంతర బడ్జెట్ అంటే ఏమిటి? దీన్ని ఎప్పుడు, ఎందుకు ప్రవేశపెడతారు?

బడ్జెట్​లో ఏం ఉండొచ్చు?

  • తాజా బడ్జెట్​లో మోదీ సర్కారు సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వొచ్చని తెలుస్తోంది.
  • ఆర్థిక వృద్ధిపై దృష్టిసారిస్తూనే పన్నుల భారాన్ని తగ్గించే ప్రయత్నం చేయవచ్చు.
  • వ్యవసాయం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రణాళికలను, అందుకు కావాల్సిన నిధులను కేటాయించవచ్చు.
  • ఆయుష్మాన్ భారత్ పరిమితి పెంపుపై ప్రకటన వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
  • రైతులకు రుణాలు పెంచడంపై ప్రకటన చేయాలని వ్యవసాయదారులు ఆశిస్తున్నారు. మౌలిక సదుపాయాలు మెరుగుపర్చడానికి ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టాలని కోరుకుంటున్నారు.

ప్లకార్డులు తీసుకురావొద్దు!
పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా సంప్రదాయం ప్రకారం కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. ఈ భేటీకి 30 పార్టీల నుంచి 45 మంది నాయకులు హాజరయ్యారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లద్ జోషి తెలిపారు. సమావేశం స్నేహపూర్వకరంగా జరిగిందని చెప్పారు. 17వ లోక్‌సభకు ఇదే చివరి సమావేశామని, ప్లకార్డుల తీసుకరావద్దని అన్ని పార్టీల ఎంపీలకు సూచించినట్లు వివరించారు. ఇండియా కూటమి ప్రస్తుతం బ్రెయిన్‌ డెడ్‌ అయ్యిందని విమర్శించారు.

ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేత
రాజ్యసభ శీతాకాల సమావేశాల్లో 11 మంది ఎంపీలపై విధించిన సస్పెన్షన్‌ను ఛైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ ఎత్తివేశారు. బడ్జెట్ సమావేశాలకు ఒక్కరోజు ముందు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సభా కార్యకలాపాలను అడ్డుకున్నారనే కారణంతో 11 మంది ఎంపీలను సస్పెండ్‌ చేశారు. నిబంధనలను ఉల్లంఘించారనే అభియోగాలకు సంబంధించి 11 మంది దోషులుగా తేలారంటూ సభా హక్కుల కమిటీ మంగళవారం ఛైర్మన్‌ను నివేదిక సమర్పించింది. అయితే వారికి విధించిన శిక్ష సరిపోతుందని నివేదికలో పేర్కొంది. ఫలితంగా 11 ఎంపీలపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ఛైర్మన్‌ నిర్ణయం తీసుకున్నారు. వారు బుధవారం నుంచి సమావేశాలకు హాజరుకావచ్చని సూచించారు.

రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రపై అసోం ప్రభుత్వం ఆంక్షలు విధించడాన్ని సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారి ప్రస్తావించారు. దేశంలో అప్రకటిత నియంతృత్వం నడుస్తోందని ఆరోపించారు. సీబీఐ, ఈడీ వంటి కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఆర్​జేడీ దిగ్గజం లాలూ ప్రసాద్​ వంటి వారిని లక్ష్యంగా చేసుకున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ నేత కే సురేశ్, టీఎంసీ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ్, డీఎంకే ఎంపీ టీఆర్ బాలు, శివసేన రాహుల్ షెవాలే, సమాజ్​వాదీకి చెందిన ఎస్​టీ హసన్, జేడీయూ ఎంపీ రామ్​నాథ్ ఠాకూర్, టీడీపీ నుంచి గల్లా జయదేవ్ సహా వివిధ పార్టీల నేతలు అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యారు.

బడ్జెట్ తరువాత బంగారం ధరలు తగ్గుతాయా? కేంద్రం గోల్డ్ టాక్స్ తగ్గిస్తుందా?

ఈసారి కూడా పేపర్‌లెస్‌ బడ్జెట్- ఆ యాప్‌లోనే అన్ని డాక్యుమెంట్స్‌

హల్వా వేడుకలో నిర్మల- ఈ 'బడ్జెట్' సంప్రదాయం వెనుక అసలు కారణం తెలుసా?

Last Updated : Jan 30, 2024, 7:41 PM IST

ABOUT THE AUTHOR

...view details