How To Make Paneer Gravy Curry : పాలకు సంబంధించిన పదార్థాల్లో పనీర్‌ది ప్రత్యేక స్థానం. ఎందుకంటే.. దీనిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉంటాయి. పైగా వీటితో చేసే కూరలు, స్వీట్లు, స్నాక్స్‌ను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. అయితే పనీర్‌తో ఎప్పుడూ ఒకే రకం వంట కాకుండా ఈ సారి పనీర్ గ్రేవీ ప్రిపేర్ చేసుకోండి. అయితే చాలా మంది పనీర్ గ్రేవీ కర్రీ చేసేటప్పుడు ఉల్లి, వెల్లుల్లిని యూజ్ చేస్తుంటారు. అవి వేయకుంటే మంచి టేస్ట్ రాదని భావిస్తుంటారు. కానీ, అవి వేయకుండా కూడా అద్దిరిపోయే రుచి వచ్చేలా పనీర్(Paneer) గ్రేవీ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి, ఇంకెందుకు ఆలస్యం అందుకు కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు :
- పనీర్ - 200 గ్రాములు
- నూనె - తగినంత
- జీడిపప్పు పలుకులు - 10
- పసుపు - పావు చెంచా
- ధనియాల పొడి - ఒక చెంచా
- జీలకర్ర పొడి - ఒక చెంచా
- పెరుగు - ఒక కప్పు
- ఉప్పు, కారం - రుచికి సరిపడా
- కసూరి మేతి - ఒక చెంచా
- జీలకర్ర - అర చెంచా
- కొద్దిగా - పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు
పనీర్‌తో ఈ స్నాక్స్ ట్రై చేయండి- పిల్లలు నుంచి పెద్దల వరకు ఆహా అనడం ఖాయం!
తయారీ విధానం :
- పనీర్ గ్రేవీ కర్రీ కోసం ముందుగా పనీర్‌ని ముక్కలుగా కోసి వేడినీటిలో వేసి కాసేపు ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల అవి తింటున్నప్పుడు రబ్బరులా సాగకుండా మృదువుగా ఉంటాయి. అదే విధంగా.. జీడిపప్పు పలుకులను శుభ్రంగా కడిగి వేడినీటిలో నానబెట్టి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు నానబెట్టుకున్న పనీర్ ముక్కలను ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత అందులో పసుపు, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ఉప్పు, కారం, కాస్త ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
- అనంతరం వేడినీటిలో నానబెట్టుకున్న జీడిపప్పును మిక్సీ జార్‌లోకి తీసుకొని గ్రైండ్ చేసి చిక్కని పేస్ట్‌లా ప్రిపేర్ చేసుకోవాలి.
- ఇప్పుడు మరో బౌల్లో కప్పు పెరుగును తీసుకోవాలి. అందులో మిగిలిన జీలకర్ర పొడి, మిగిలిన ధనియాల పౌడర్, కారం, పసుపు వేసి మిక్స్ చేసుకోవాలి.
- తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న జీడిపప్పు పేస్ట్‌ను అందులో వేసి బాగా కలుపుకోవాలి. అయితే, పెరుగు పుల్లగా ఉంటే కొద్దిగా చక్కెర యాడ్ చేసుకోవచ్చు.
- ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. అది కాస్త హీట్ అయ్యాక జీలకర్ర, పచ్చిమిర్చి తరుగు వేసి కాసేపు వేయించుకోవాలి.
- అనంతరం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పనీర్ మిశ్రమాన్ని అందులో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు లో ఫ్లేమ్‌లో పనీర్ ముక్కలను ఫ్రై చేసుకోవాలి.
- ఆ విధంగా వేయించుకున్నాక ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న పెరుగు, జీడిపప్పు మిశ్రమాన్ని అందులో వేసుకొని కాసేపు ఉడికించుకోవాలి.
- తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకోవాలి. ఆ మిశ్రమం మంచిగా ఉడికి గ్రేవీలా మారిందనుకున్నాక.. దించే ముందు కసూరి మేతి, కొత్తిమీర తరుగు వేసుకోవాలి.
- అంతే.. ఎంతో టేస్టీగా ఉండే నోరూరించే పనీర్ గ్రేవీ కర్రీ రెడీ!
- దీన్ని రోటీ, పులావ్, బిర్యానీ.. ఇలా దేనిలో తిన్నా సూపర్ టేస్టీగా ఉంటుంది!
నోరూరించే పులావ్- ఇలా చేశారంటే వహ్వా అంటూ ప్లేట్లు నాకాల్సిందే!