Pakistani ISI Agent Arrested : భారత్-రష్యా వ్యూహాత్మక సంబంధాలపై పాకిస్థాన్ నిఘా పెట్టిన విషయాన్ని ఉత్తర్‌ప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ బయటపెట్టింది. ఇందుకోసం ఐఎస్‌ఐ తన గూఢచారిని ఏకంగా రష్యా రాజధాని మాస్కోలోని భారత దౌత్య కార్యాలయంలో నియమించింది. ఇతడి ద్వారా ఇరు దేశాలకు చెందిన కీలక సమాచారాన్ని అపహరిస్తోంది పాక్. ఈ క్రమంలో నిందితుడు(గూఢచారి) సతేందర్ సివాల్‌ను తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఉగ్రవాద నిరోధక దళం మేరఠ్‌లో అదుపులోకి తీసుకుంది. ఇతడిని హాపూర్ జిల్లాలోని షామహియుద్దీన్‌పూర్ గ్రామానికి చెందిన జైవీర్ సింగ్ కుమారుడిగా గుర్తించింది. అతడు 2021 సంవత్సరం నుంచి విదేశాంగ శాఖలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్(ఐబీఎస్ఏ)గా విధులు నిర్వర్తిస్తున్నాడు.
భారత విదేశాంగ శాఖలో ఓ ఐఎస్‌ఐ ఏజెంట్ చొరబడ్డాడనే రహస్య సమాచారం అందగా ఉత్తర్‌ప్రదేశ్ ఏటీఎస్ అలర్ట్ అయింది. అతడు భారత సైన్యానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్ నిఘా సంస్థకు అందజేస్తున్నాడని, ప్రతిగా డబ్బు తీసుకొంటున్నట్లు పసిగట్టింది. అతడి కదలికలపై నిఘా పెట్టి ఆరెస్టు చేసినట్లు తెలిపింది. కాగా, ఈ సమాచారం భారత్‌కు భారీ ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత సైనిక సంస్థలు ఆదివారం దీనిపై ఓ అధికారిక ప్రకటనను విడుదల చేశాయి.