తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లోక్​సభ పోరులో ఓటమి- 10ఏళ్ల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ- ఒమర్ ఎదుట ఉన్న సవాళ్లివే! - OMAR ABDULLAH

జమ్ముకశ్మీర్ కొత్త ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా రాజకీయ ప్రస్థానం- ముందున్న సవాళ్లు!

Omar Abdullah
Omar Abdullah (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Oct 8, 2024, 5:49 PM IST

Omar Abdullah Political Career : జమ్ముకశ్మీర్​లో శాసనసభ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమి విజయం సాధించిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా బాధ్యతలు చేపట్టనున్నారు. దీంతో జమ్ముకశ్మీర్ రాజకీయాల్లో తన కుటుంబ వారసత్వాన్ని ఒమర్ కొనసాగిస్తున్నారు. అయితే జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదా, ఆర్టికల్ 370 పునురద్ధరణ, ఉచిత విద్యుత్ వంటి సవాళ్లు ఎదురవ్వనున్నాయి. ఈ సవాళ్లను పరిష్కరించడంలో ఒమర్ ఏ మేర సఫలీకృతం అవుతారో చూడాలి.

కొన్ని నెలల క్రితమే ఓటమి- ఇప్పుడు విజయం
కొన్ని నెలల క్రితమే జరిగిన లోక్​సభ ఎన్నికల్లో ఒమర్ ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత జమ్ముకశ్మీర్ (కేంద్రపాలిత ప్రాంతం)లో జరగబోయే ఎన్నికల్లో పోటీ చేయనని వ్యాఖ్యానించారు. కేంద్ర పాలిత ప్రాంతంలోని విధానసభలో అడుగుపెట్టి, జమ్ముకశ్మీర్​ను అవమానించబోనని పేర్కొన్నారు. అయితే జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడం వల్ల మాట మార్చారు. తన కుటుంబానికి గట్టి పట్టు ఉన్న బుడ్గామ్, గందేర్​ బాల్​లో బరిలోకి దిగి విజయ కేతనం ఎగురవేశారు.

హామీలతో రాలిన ప్రజల ఓట్లు!
ఆర్టికల్ 370 పునరుద్ధరణ, జమ్ముకశ్మీర్​కు రాష్ట్రహోదా, పేదలకు ఉచితంగా 12 గ్యాస్ సిలిండర్లు, ఉచిత విద్యుత్ వంటి హామీలతో ఒమర్ అబ్దుల్లా ప్రజల ముందుకు వెళ్లారు. ఈ హామీలను విశ్వసించిన ప్రజలు నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమికి పట్టంకట్టారు. అలాగే ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ తో పొత్తు పెట్టుకుని ఓట్లను చీలకుండా ఒమర్ జాగ్రత్తపడ్డారు. దీంతో కాంగ్రెస్, ఎన్​సీ కూటమి 90 నియోజకవర్గాలకుగానూ 48 సీట్లలో గెలుపొందింది.

ఒమర్ అబ్దుల్లా రాజకీయ ప్రస్థానం

  • 1998, 1999, 2004 లోక్​సభ ఎన్నికల్లో వరుసగా మూడు సార్లు విజయం
  • 2002 అసెంబ్లీ ఎన్నికలలో గందేర్‌ బల్​లో ఖాజీ మొహమ్మద్ అఫ్జల్​పై ఓటమి
  • 2008 శాసనసభ ఎన్నికల్లో గందేర్ బల్ నుంచి విజయం. కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు. 38 ఏళ్ల వయసులో సీఎంగా బాధ్యతలు స్వీకరణ.

దేశంలోనే అతి పిన్న వయసులో సీఎం బాధ్యతలు చేపట్టినవారిలో ఒకరిగా నిలిచారు ఒమర్ అబ్దుల్లా. కాగా, ఒమర్ అబ్దుల్లా తండ్రి ఫరూక్ అబ్దుల్లా కూడా జమ్ముకశ్మీర్ సీఎంగా పనిచేశారు. అలాగే ఒమర్ తాత షేక్ అబ్దుల్లా సైతం ముఖ్యమంత్రిగా పనిచేశారు.

ABOUT THE AUTHOR

...view details