Oldest Cricketer in Kashmir : క్రికెట్ ఆడటానికి వయసు అడ్డంకి కాదని ఓ శతాధిక వయోవృద్ధుడు నిరూపించారు. 102 ఏళ్ల వయసులో యువకుడిలా క్రికెట్ ఆడుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఏకంగా కుర్రాళ్లతో పోటీపడి మరీ క్రికెట్ ఆడుతున్నారు. ఆయనే కశ్మీర్‌లోని రియాసీకి చెందిన హాజీ కరమ్ దిన్. వయసు వందేళ్లు పైబడినా కాళ్లకు ప్యాడ్స్, చేతులకు గ్లౌజులు వేసుకుని దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నారు హాజీ. తర్వాతి తరానికి మెలకువలు కూడా నేర్పిస్తున్నారు.
"నాకు క్రికెట్ ఆడటం అంటే చాలా ఇష్టం. నేను నా పిల్లలను తీసుకుని అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుంటాను. వాళ్లు ఆడే విధానాన్ని చూస్తా. ఆటలో ఏమైనా తప్పులు చేస్తే వాటిని సరి చేస్తుంటాను" అని హాజీ కరమ్ దిన్ చెబుతున్నారు.
ఔటైతే తిట్టడమే!
యువతకు ఆదర్శంగా నిలుస్తూ ఈ వయస్సులో కూడా గ్రౌండ్‌కు వచ్చి మాతో నాన్న క్రికెట్ ఆడటం చాలా సంతోషంగా ఉందని హాజీ కుమారుడు మహ్మద్ నదీమ్ చెబుతున్నారు.
"మా నాన్న మంచి క్రికెటర్. నా కుమారుడు కూడా ఇక్కడ ఆడుతాడు. ఆయనతో ఆడుతుంటే నాకు ఆనందంగా అనిపిస్తుంది. నేను ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నా. బ్యాటింగ్, బౌలింగ్ చేస్తున్న సమయంలో ఆయన మాకు ఎన్నో మెలకువలు నేర్పిస్తారు. ఒక వేళ మేం ఒక్క పరుగు కూడా చేయకుండా ఔటైతే తిట్లు తింటాం. ఎందుకు ఇలాంటి షాట్ ఆడారని అప్పుడప్పుడు సరదాగా కొడతారు కూడా. అయినా కూడా మాకు ఆయన ఇలా చెప్పడం ఎంతో నచ్చుతుంది"