O Panneerselvam Contest As Independent Candidate :2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ దక్షిణ భారతంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. తమిళనాడులో ఎలాగైనా ఈసారి అత్యుత్తమ ఫలితాలను సాధించాలనే పట్టుదలతో ఉన్న మోదీసేన అందుబాటులో ఉన్న ప్రతీ అవకాశాన్ని వాడుకుంటోంది. ఈ క్రమంలోనే అన్నాడీఎంకే బహిష్కృత సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం(ఓపీఎస్)ను తమ వైపునకు తిప్పుకొని అన్నా డీఎంకేపైకి అస్త్రంగా ప్రయోగిస్తోంది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి పన్నీర్ సెల్వం పోటీ చేస్తున్న రామనాథపురం లోక్‌సభ నియోజకవర్గంపైనే ఉంది. ఏప్రిల్ 19న పోలింగ్ జరగనున్న ఈ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న పన్నీర్ సెల్వంకు బీజేపీ మద్దతు ప్రకటించింది. అక్కడి నుంచి అభ్యర్థిని నిలపబోమని వెల్లడించింది.
రామనాథపురం స్థానంలో ఎవరి బలం ఎంత?
రామనాథపురం పార్లమెంట్ స్థానం నుంచి అన్నాడీఎంకే అభ్యర్థిగా 59 ఏళ్ల పి.జయపెరుమాళ్ పోటీ చేస్తున్నారు. రైతు అయిన జయపెరుమాళ్ కారియాపట్టి తాలూకాకు చెందినవారు. డీఎంకే రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సభ్యునిగా పనిచేసిన ఆయన 2011లోనే అన్నాడీఎంకేలో చేరారు. ఇక అధికార డీఎంకే కూటమి తరఫున ముస్లిం లీగ్ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీ నవాస్ కాని పోటీలో ఉన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో నవాస్ కాని 4.69 లక్షల ఓట్లతో విజయభేరి మోగించారు. అప్పట్లో అన్నాడీఎంకే మద్దతుతో పోటీచేసిన బీజేపీ అభ్యర్థి నయనార్ నాగేంద్రన్‌కు 3.42 లక్షల ఓట్లు పడ్డాయి.
అయితే ఈసారి అన్నాడీఎంకే, బీజేపీ వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీతో పాటు అన్నాడీఎంకేలోని చీలిక వర్గం మద్దతుతో తాను సులువుగా రామనాథపురం పార్లమెంట్ స్థానం నుంచి గెలుస్తాననే ధీమాతో పన్నీర్ సెల్వం ఉన్నారు. గత ఎన్నికల్లో ముస్లిం లీగ్ అభ్యర్థి కేవలం లక్ష ఓట్ల మెజారిటీని సాధించారని దానిని సులువుగా తాను అధిగమిస్తానని సెల్వం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక అన్నాడీఎంకే పార్టీకి చెందిన రెండు ఆకుల చిహ్నాన్ని వాడుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ పన్నీర్ సెల్వం దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు సోమవారం జూన్10కి వాయిదా వేసింది. అంటే ఈ ఎన్నికల్లో ఆయనకు ఆ చిహ్నం వాడుకునే ఛాన్స్ లేనట్టే!