Maharashtra Jharkhand Elections NOTA :ఎన్నికల బరిలో నిల్చున్న వారెవరూ నచ్చలేదని చెప్పేందుకు ఓటరుకు ఎన్నికల సంఘం (ఈసీ) ఇచ్చిన అవకాశమే నోటా. ఇటీవల జరుగుతున్న వరుస ఎన్నికల్లో నోటాకు అంతగా ఆదరణ లభించడం లేదు. తాజాగా వెలువడిన మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే కొనసాగింది. ఆ రెండు రాష్ట్రాల్లో వరుసగా నోటాకు 0.75 శాతం, 1.32 శాతం ఓట్లు మాత్రమే పడ్డాయి. 2013లో నోటాను ఈసీ తొలిసారి ప్రవేశపెట్టగా బ్యాలెట్ కాగితంపై క్రాస్ మార్క్ గుర్తును కేటాయించింది. 2013కి ముందు అభ్యర్థులు ఎవరూ నచ్చలేదనుకుంటే తనకు ఓటింగ్‌లో పాల్గొనే ఆసక్తి లేదని చెప్పేందుకు ఓటరు పోలింగ్ కేంద్రంలో 49- ఓ ఫాంను నింపాల్సి వచ్చేది.
మహారాష్ట్ర అలా- ఝార్ఖండ్‌లో ఇలా- 'నోటా'కు ఈసారీ అరకొరే! - MAHARASHTRA JHARKHAND NOTA
నోటాకు లభించని ఆదరణ- మహారాష్ట్రలో 0.75 శాతం, ఝార్ఖండ్‌లో 1.32 శాతం ఓట్లు
Published : Nov 24, 2024, 7:06 AM IST
గోప్యతా హక్కును దెబ్బతీస్తుండటం వల్ల!
ఇది గోప్యతా హక్కును దెబ్బతీస్తుండటం వల్ల సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నోటా ఐచ్ఛికాన్ని ఈసీ అందుబాటులోకి తెచ్చింది. నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే అక్కడ పోలింగ్‌ను తిరిగి నిర్వహించాలన్న వాదనను మాత్రం సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మాజీ సీఈసీ ఓపీ రావత్ ఇటీవల మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో నోటాకు అంతగా ప్రాధాన్యం లేదని అభిప్రాయపడ్డారు. ఏదైనా ఒక స్థానంలో 50 శాతం కన్నా ఎక్కువ మంది నోటాకు ఓటు వేసి అభ్యర్థులు ఎవరూ తమకు నచ్చలేదని రాజకీయ పార్టీలకు చూపించాలమని, అలాంటి ఫలితాలు వస్తేనే పార్లమెంటు, ఎన్నికల సంఘంపై ఒత్తిడి పెరిగి నోటాను బలమైన ఆయుధంగా మార్చేలా నిబంధనలు వస్తాయని ఆయన పేర్కొన్నారు.
ఎగ్జిట్ పోల్స్‌కు 50శాతం మార్కులే!
మరోవైపు, మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లో ఎన్నికల ఫలితాలను అంచనా వేయడంలో మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ 50 శాతం సఫలతను మాత్రమే సాధించాయి. మహారాష్ట్రలో మహాయుతి (ఎన్‌డీఏ) విజయం సాధించబోతుందన్న అంచనాకు దాదాపు అన్ని సర్వేలు వచ్చాయి. అయితే, మొత్తం 288 స్థానాలకు గాను 230 చోట్ల భారీ స్థాయి ఆధిక్యాన్ని మహాయుతి సాధిస్తుందని సర్వేలు పసిగట్టలేకపోయాయి. ఇక అన్ని సర్వేలు కూడా ఝార్ఖండ్ ఫలితాల విషయంలో పొరబడ్డాయి.