తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఇండియా' కూటమికి నీతీశ్‌ గుడ్‌ బై? NDAలోకి ఎంట్రీ! అదే కారణమా?

Nitish Kumar Shocks To India Bloc : విపక్ష ఇండియా కూటమికి వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు సీఎంలు 'ఇండియా'కు ఎవరూ ఊహించిన షాక్​లు ఇవ్వగా తాజాగా ఈ జాబితాలోకి బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్​ కుమార్​ కూడా చేరినట్లు తెలుస్తోంది. కూటమి నుంచి ఆయన తప్పుకోని బీజేపీతో చేతులు కలపనున్నారని పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.

Nitish Kumar Shocks To India Bloc
Nitish Kumar Shocks To India Bloc

By ETV Bharat Telugu Team

Published : Jan 25, 2024, 8:27 PM IST

Updated : Jan 25, 2024, 8:45 PM IST

Nitish Kumar Shocks To India Bloc : కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఏర్పాటైన విపక్ష ఇండియా కూటమిలో అనూహ్య పరిణామాలు వెలుగు చూస్తున్నాయి. కూటమిలో కీలక నేతగా ఉన్న జేడీయూ అధినేత, బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ తాజాగా ఇండియా గ్రూప్​ నుంచి వైదొలుగుతున్నట్లు సమాచారం అందుతోంది. ఆయన మళ్లీ బీజేపీతో కలిసి పని చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ కీలక నేతలతో నీతీశ్​ చర్చలు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి.

కాగా, ఇప్పటికే ఈ కూటమికి బంగాల్​ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్​ అధినేత్రి మమతా బెనర్జీ, పంజాబ్​ సీఎం భగవంత్‌మాన్‌ (ఆమ్‌ అద్మీ పార్టీ​) గట్టి షాక్​లు ఇచ్చారు. వచ్చే లోక్​సభ ఎన్నికల్లో ఇరు పార్టీలు ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు ఇరువురు సీఎంలు బుధవారం బహిరంగంగా వెల్లడించారు. పంజాబ్‌ సహా హరియాణా, దిల్లీ, గోవా, గుజరాత్‌లలో సీట్ల సర్దుబాటుపై చర్చల్లో ప్రతిష్ఠంభన నెలకొన్న వేళ వారిద్దరు ఈ ప్రకటన చేశారు. ఈ వరుస పరిణామాలను పరిశీలిస్తే ఎన్నికల వేళ 'ఇండియా కూటమి'కి గట్టి దెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రాహుల్​ యాత్రకు నీతీశ్​ దూరం
బీజేపీకి వ్యతిరేకంగా దేశప్రజలందరినీ ఏకం చేసేందుకు భారత్‌ జోడో యాత్ర చేపట్టిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ- ఇటీవల 'భారత్ న్యాయ్ యాత్ర పేరు'తో మరో యాత్రను ప్రారంభించారు. మణిపుర్‌ నుంచి ముంబయి వరకు మొత్తం 6,200 కి.మీ మేర ఈ యాత్ర కొనసాగనుంది. ఈనెల 14న మణిపుర్​లో ఈ యాత్రకు శ్రీకారం చుట్టిన రాహుల్​ జనవరి 29న బిహార్‌కు చేరుకుంటుంది. జనవరి 30న పూర్ణియాలో జరిగే రాహుల్​ భారత్‌ జోడో న్యాయ యాత్రకు సంబంధించిన ర్యాలీలో జేడీయూ సహా ఆర్​జేజీ, లెఫ్ట్​ పార్డీలన్నీ పాల్గొనాల్సి ఉంది. అయితే ఈ ర్యాలీకి నీతీశ్​ కుమార్​ హాజరుకావడం లేదంటూ ఇప్పటికే వార్తా కథనాలు వెలువడుతున్నాయి. అంతేకాకుండా మంగళవారం బిహార్​ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత కర్పూరీ ఠాకుర్‌కు మోదీ ప్రభుత్వం భారతరత్నను ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని ప్రస్తుత సీఎం నీతీశ్​ కుమార్​ స్వాగతిస్తూ మోదీపై ప్రశంసలు కురిపించారు. ఇవన్నీ నీతీశ్​ నిజంగానే ఇండియా కూటమికి గుడ్​బై చెప్పనున్నారంటూ జరుగుతున్న చర్చకు మరింత ఊతమిస్తున్నాయి.

నీతీశ్​ నిర్ణయానికి అదే కారణమా?
ఇండియా కూటమి ఏర్పాటు కావడంలో నీతీశ్‌ కుమార్‌ది కీలక పాత్ర. ఇప్పటికే పలుమార్లు భేటీ అయిన కూటమిలోని పార్టీలు ఇటీవల మరో కీలక సమావేశాన్ని నిర్వహించాయి. ఈ మీటింగ్​లో కూటమి సారథిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఎన్నుకోవడంపై నీతీశ్​ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సారథి బాధ్యతలు ఆశించిన ఆయన్ను కన్వీనర్‌ పదవి స్వీకరించాలని కూటమిలోని కొందరు కీలక నేతలు ఒప్పించే ప్రయత్నం చేశారు. అయినా అందుకు అంగీకరించలేదని సమాచారం. అంతేకాకుండా బిహార్‌లో సీట్ల సర్దుబాటు విషయంలోనూ ఇప్పటివరకు కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. ఇలాగైతే రానున్న పార్లమెంట్​ ఎన్నికల్లో తమ పార్టీకి ముప్పు వాటిల్లుతుందనే ఉద్దేశంతోనే కూటమి నుంచి తప్పుకుని బీజేపీతో చేతులు కలపాలని నీతీశ్​ చూస్తున్నట్లు సమాచారం.

ఎస్పీతోనూ విభేదాలు
మరోవైపు సమాజ్‌వాదీ పార్టీతోనూ కాంగ్రెస్‌కు సఖ్యత కుదరడం లేదు. మహారాష్ట్రలో సీట్ల సర్దుబాటుపై ఈ రెండు పార్టీల మధ్య భేదాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. ఈ వివాదం ఇంకా కొలిక్కి రాకుముందే నీతీశ్​ వేస్తున్న అడుగులు దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ప్రచారం సాగుతున్నట్లు అలానే జరిగితే గనుక బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పాటైన ఇండియా కూటమి లక్ష్యం బెడిసికొట్టినట్లే.

మోదీపై ప్రశంసలు, 'ఇండియా'పై విమర్శలు!- నీతీశ్‌ రూట్‌ కూడా మారనుందా?

అయోధ్య రాముడికి భారీగా విరాళాలు- ఒక్కరోజే రూ.3కోట్లు- దర్శనం వేళలు పొడిగింపు

Last Updated : Jan 25, 2024, 8:45 PM IST

ABOUT THE AUTHOR

...view details