Nilesh Sabe Successful Business Story: అనుకున్నది సాధించాలంటే పట్టుదలతో పాటు ధైర్యం కూడా ఉండాలని నిరూపించాడు మహారాష్ట్రకు చెందిన ఓ యువకుడు. రెండు ఎకరాల భూమిని తాకట్టు పెట్టి మరీ చదువు సాగించిన ఆ యువకుడు, రూ.12వేల శాలరీకే ఓ ఉద్యోగంలో చేరారు. అయితే వచ్చే జీతంతో తాకట్టులో ఉన్న తన పొలాన్ని విడిపించుకోలేనని మూడు నెలలకే ఆ ఉద్యోగం మానేశారు. ఆ తర్వాత ఓ బిజినెస్ మ్యాగజైన్ ప్రారంభించారు. అలా ప్రస్తుతం సంవత్సరానికి రూ.60 కోట్ల వరకు సంపాదిస్తున్నారు. అంతే కాకుండా స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తున్నారు. ఈ యువ వ్యాపారవేత్తే మహారాష్ట్రలోని అకోలా జిల్లాకు చెందిన నీలేశ్ సాబే.
కొలాసా గ్రామానికి చెందిన నీలేశ్‌ను తన తల్లిందడ్రులు రెండెకరాల భూమిని తాకట్టు పెట్టి ఇంజినీరింగ్ చదివించారు. ఐటీ విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న నీలేశ్ రూ.12 వేల శాలరీకి పుణెలోని ఓ కంపెనీలో ఉద్యోగానికి చేరారు. అయితే తమ కుమారుడు తాకట్టులో ఉన్న పొలాన్ని విడిపిస్తారని ఆశించారు నీలేశ్ తల్లిదండ్రులు. కానీ మూడు నెలల్లోనే ఉద్యోగం మానేసి ఇంటికి వచ్చారు నీలేశ్. ఉద్యోగం చేయాలని లేదని, వ్యాపారం చేయాలనుకుంటున్నానని తల్లిదండ్రలకు చెప్పారు. మొదట్లో వాళ్లు అంగీకరించలేదు. ఆ తర్వాత కొన్నాళ్లుకు ఒప్పుకున్నారు. నీలేశ్ ఆశయానికి అండగా నిలిచారు.
కొవిడ్లోనూ !
ఉద్యోగం మానేశాక 'స్విఫ్ట్ ఎన్ లిఫ్ట్' అనే బిజినెస్ మ్యాగజైన్‌ను ప్రారంభించాడు నీలేశ్ సాబే. ఇందులో దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తల విజయగాథలను ప్రచురించారు. అలాగే వ్యాపారవేత్తలు చెప్పే వ్యాపార లాభాలు, చిట్కాలను అందులో పొందుపరిచేవారు. దీంతో ఈ మ్యాగజైన్ సక్సెస్ అయ్యింది. 2020లో ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ మహమ్మారి కారణంగా నీలేశ్ సాబే మ్యాగజైన్‌కు ఆదరణ తగ్గింది. ఈ క్రమంలో అమెరికాలో కొన్ని పరిశ్రమలు లాభలతో నడిచాయని విషయాన్ని తెలుసుకున్నారు నీలేశ్. అనంతరం ఆ పారిశ్రామికవేత్తలను సంప్రదించి, వారి స్టోరీలను ప్రచురించారు. దీంతో నీలేశ్ కొవిడ్ కష్టకాలంలో ఉన్న ఆయన మ్యాగజైన్ సక్సెస్ సాధించింది. అలాగే మ్యాగజైన్లో వ్యవస్థాపకుల వస్తువుల గురించి రాసేవారు. దీంతో మ్యాగజైన్ ఆర్థికంగా కూడా విజయం సాధించింది.