New EC Commissioners Appointment :ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. 2023 నాటి చట్టాన్ని అనుసరించి నియామకాలు చేపట్టకుండా కేంద్రాన్ని నిలువరించాలని కాంగ్రెస్ నేత జయా ఠాకూర్ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషిన్ వేశారు. ఈసీల నియామకాలపై 2023లో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అనుసరించి తాజా నియమకాలు చేపట్టేలా ఆదేశాలివ్వాలని పిటిషనర్ కోరారు.
"త్వరలోనే సార్వత్రిక ఎన్నికల జరగనున్న వేళ కమిషనర్ రాజీనామా చేశారు. ఈ పరిస్థితుల్లో కమిషనర్ల నియామకం తప్పనిసరి. కానీ వీరి నియామకాలను ఈసీ నియామక చట్టం 2023లోని సెక్షన్ 7, 8 ప్రకారం చేయకూడదు. 2023 మార్చి 2న అనూప్ బరన్వాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఇచ్చిన తీర్పును కేంద్రం అనుసరించేలా ఆదేశాలు ఇవ్వాలి." అని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో జయా ఠాకూర్ పేర్కొన్నారు.
త్వరగానే పరిశీలిస్తాం : సుప్రీం
మరోవైపు ఈ పిటిషన్‌పై స్పందించిన సుప్రీంకోర్టు, వీలైనంత త్వరగా లిస్టింగ్ చేసి పరిశీలిస్తామని సోమవారం తెలిపింది. ఈ మేరకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం వెల్లడించింది.
15లోగా కొత్త కమిషనర్ల నియామకం!
గత నెల ఒక కమిషనర్ అనూప్ చంద్ర పాండే పదవీ విరమణ చేశారు. ఇటీవల మరో కమిషనర్ అరుణ్ గోయల్ అనూహ్యంగా రాజీనామా చేశారు. ఫలితంగా ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఒక్కరే మిగిలారు. ఈ క్రమంలోనే ఖాళీ అయిన స్థానాలను భర్తీ చేసేందుకు కేంద్రం కసరత్తు మొదలుపెట్టింది. ప్రధాని మోదీ, కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత అధీర్ రంజన్ చౌధరి, కేంద్ర మంత్రి సభ్యులుగా ఉన్న ఎంపిక కమిటీ మార్చి 15లోగా కొత్త కమిషనర్ల పేర్లను ఖరారు చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అంతకుముందు ఎన్నికల కమిషనర్ల నియామకాలపై పార్లమెంటులో చట్టం చేసేవరకు ప్రధానమంత్రి నేతృత్వంలో లోక్‌సభలో విపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) కలిసి సీఈసీ, ఈసీ నియామకాలు చేపట్టాలని 2023 మార్చిలో అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. అయితే, గతేడాది డిసెంబరులో కేంద్రం దీనిపై కొత్త చట్టం అమల్లోకి తెచ్చింది. ఎంపిక కమిటీలో సీజేఐ స్థానంలో ప్రధాని సూచించిన కేంద్రమంత్రిని చేర్చింది. అయితే, ఈ కొత్త చట్టాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఎంపిక కమిటీలో కేంద్రానికి ఎక్కువ అధికారం ఉంటే ఈసీ స్వతంత్రతకు ముప్పు వాటిల్లితుందని విమర్శించాయి. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశాయి.
ఎలక్షన్ కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా- లోక్‌సభ ఎన్నికలకు ముందు సంచలన నిర్ణయం!
'బీజేపీ టికెట్‌పై అరుణ్ గోయెల్ పోటీ?'- ఎన్నికల కమిషనర్ రాజీనామాపై విపక్షాలు ఫైర్