తెలంగాణ

telangana

NEET​ అక్రమాలపై దేశవ్యాప్త నిరసనకు కాంగ్రెస్ పిలుపు- యోగా డే రోజునే​! - NEET PROTEST

By ETV Bharat Telugu Team

Published : Jun 19, 2024, 8:00 PM IST

NEET Row Congress Protest : నీట్‌ పరీక్ష నిర్వహణలో జరిగిన అక్రమాలపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్​ పిలుపునిచ్చింది. జూన్ 21న యోగా డే రోజునే దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసింది.

NEET : Congress to hold nationwide protest on Friday
NEET-UG row (ANI)

NEET Row Congress Protest : నీట్‌ పరీక్ష నిర్వహణలో జరిగిన అక్రమాలపై దేశవ్యాప్తంగా విద్యార్థులు, విపక్షాలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జూన్ 21న యోగా డే రోజున నీట్‌లో జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. జూన్ 21న దేశవ్యాప్తంగా అన్ని పార్టీ యూనిట్లలో నిరసనలు చేపట్టాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ బుధవారం కోరారు. నీట్‌ పరీక్ష నిర్వహణలో అక్రమాలు జరిగాయని చెప్పడానికి బిహార్, గుజరాత్, హరియాణాల్లో జరిగిన అరెస్టులే నిదర్శనమని ఆయన అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వ్యవస్థీకృత అవినీతి స్పష్టంగా కనిపిస్తోందని మండిపడ్డారు.

దేశవ్యాప్తంగా నిర్వహించే పరీక్షల్లో జరిగే ఇటువంటి అక్రమాలు పరీక్ష ప్రక్రియల విశ్వసనీయతను దెబ్బ తీస్తాయన్నారు. దీని వల్ల ఎందరో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా కఠిన చట్టాలను అమలు చేస్తామని, యువత భవిష్యత్తుకు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అందులో భాగంగానే విద్యార్థులకు న్యాయం అందేలా చేయడం కోసం తాము దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిస్తున్నామని తెలిపారు.

ఆప్​ నిరసనలు
నీట్‌ పరీక్షలో అక్రమాలు జరిగాయంటూ విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఈ వ్యవహారంపై ఆప్‌ దేశవ్యాప్త నిరసనలు చేపట్టింది. ఆ పార్టీ ఎంపీ సందీప్‌ పాఠక్‌ బుధవారం మీడియాతో మాట్లాడారు. పేపర్‌ లీకేజీలను బీజేపీ వ్యవస్థీకృతం చేస్తోందని, నీట్‌ అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.నీట్‌ పరీక్షకు కొద్ది రోజుల ముందే భారీ అవినీతి జరిగిందన్న ఆయన, ఈ దేశానికి నీట్‌ పరీక్ష ఎంతో కీలకమైనదన్నారు. వైద్య కళాశాల్లో అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశాలన్నీ ఈ పరీక్ష ద్వారానే చేపడతారని గుర్తు చేశారు.

దాదాపు లక్ష సీట్లు ఉంటే.. దేశవ్యాప్తంగా 24లక్షల మంది విద్యార్థులు పోటీ పడ్డారన్నారు. విద్యార్థులు ఎంతో కష్టపడి చదివి ప్రిపేర్‌ అయ్యారని.. ఈ ప్రక్రియలో వారి కుటుంబాలు సైతం భాగస్వాములయ్యాయన్నారు. ఈ వ్యవహారాన్ని ఆప్‌ రాజకీయం చేయదలచుకోలేదని చెప్పిన పాఠక్‌, దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ దీనిపై కచ్చితంగా స్పందించాలని కోరారు. కేంద్ర విద్యాశాఖమంత్రిని సస్పెండ్‌ చేయాలి లేదా సంబంధిత మంత్రి తనకు తానుగా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వైద్య సంస్థలలో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులలో ప్రవేశం కోరుకునే విద్యార్థుల కోసం ప్రతి సంవత్సరం నిర్వహించే ఏకైక ప్రవేశ పరీక్ష నీట్‌-యూజీ. ఈ సంవత్సరం మే 5న నిర్వహించిన ఈ పరీక్షకు సుమారు 24లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. జూన్ 4న ఫలితాలు ప్రకటించారు. కాగా 1563 మంది విద్యార్థులకు అదనంగా గ్రేస్‌ మార్కులు ఇచ్చారు. ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల్లో మార్పులు, పరీక్ష కేంద్రాల వద్ద సమయం కోల్పోవడం వల్ల వీటిని కలిపారు. అయితే దీనిపై అభ్యంతరాలు వ్యక్తమవడం, నీట్‌ పరీక్షలో అక్రమాలపై ఆరోపణలు రావడం దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

JEE, NEETలో టాప్ ర్యాంకులు- కానీ AIIMS కాదని IISCలో అడ్మిషన్​- రీజన్ ఏంటంటే? - Avik Das Takes Admission In IISC

పార్సిల్​లో షాకింగ్ ఐటెమ్- ప్రొడక్ట్​తోపాటు 'పాము' డెలివరీ- చిప్స్ ప్యాకెట్​లో కప్ప! - Snake In Amazon Package

ABOUT THE AUTHOR

...view details