PM Modi Speech In Srinagar : ప్రజాస్వామ్యంపై జమ్ముకశ్మీర్ యువతకు విశ్వాసం ఏర్పడిందని, వారి ఓటు మార్పు తేగలదని భావిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్రహోదా పునరుద్ధరిస్తామన్న హామీని బీజేపీ నిలబెట్టుకుంటుందన్నారు. జమ్ముకశ్మీర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా షేర్-ఇ-కశ్మీర్ స్టేడియంలో జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ జమ్ముకశ్మీరీ యువత నిస్సహాయ స్థితిలో లేదన్నారు. మోదీ ప్రభుత్వంలో వారంతా సాధికారత సాధిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడి యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జమ్ముకశ్మీర్ బీజేపీ భారీ ప్రకటనలు చేయటం సంతోషంగా ఉందన్నారు. నైపుణ్యాభివృద్ధిలో, ఉద్యోగాల కల్పనలో అవకతవకలకు తావులేకుండా బీజేపీ చూస్తుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.
విభజన రాజకీయాలు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం జమ్మూకశ్మీర్‌లో పర్యటించారు. శ్రీనగర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీలు అనే మూడు పార్టీలు తమ సొంత ప్రయోజనాల కోసం ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. వారి స్వార్థం కారణంగా కశ్మీరీ ప్రజలకు పెను నష్టం వాటిల్లిందన్నారు.
"1980ల్లో ఏం జరిగిందో మర్చిపోయారా? ఆ మూడు పార్టీలు (కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ) జమ్మూకశ్మీర్‌ను వారి సొంత సామ్రాజ్యంగా భావించాయి. ఆ మూడు కుటుంబాలవారు (గాంధీ, ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా కుటుంబం) కాకుండా ఇంకెవర్నీ రాజకీయాల్లోకి రానిచ్చేవారు కాదు. విద్యకు దూరమైన మన యువత చేతిలో వారు రాళ్లు పెట్టారు. వారి స్వప్రయోజనాల కోసం మన పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తున్నారు. జమ్మూకశ్మీర్‌పై కుట్రలు చేసే ప్రతి శక్తినీ ఓడించి తీరుతాం" అని ప్రధాని మోదీ అన్నారు.
భారీ ఓటింగ్
ఈ సందర్భంగా ఇటీవల జరిగిన తొలి విడత ఎన్నికల్లో భారీగా ఓటింగ్ శాతం నమోదవ్వడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. "ఇప్పుడు జమ్మూకశ్మీర్ యువత నిస్సహాయులు కాదు. ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత ఇక్కడ అభివృద్ధి వేగంగా జరుగుతోంది. ఇప్పుడు కశ్మీర్ యువత రాళ్లను వదిలి పుస్తకాలు, పెన్నులు పట్టుకుంటున్నారు. వారికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. అంతేకాదు. ఇక్కడి ప్రజలు ఎలాంటి భయం, బెరుకు లేకుండా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. రెండో విడతలోనూ మరింత ఎక్కువ మంది ఈ ప్రజాస్వామ్య పండుగలో పాల్గొని సరికొత్త రికార్డులు సృష్టించాలి" అని మోదీ పిలుపునిచ్చారు.