Sandeep Ghosh Registration Cancelled : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా హత్యాచార ఘటనలో ఆర్జీ కర్ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ మెడికల్ రిజిస్ట్రేషన్ రద్దయింది. బంగాల్ మెడికల్ కౌన్సిల్ ఆయన రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. బంగాల్ మెడికల్ యాక్ట్-1914లోని పలు నిబంధనల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు WBMC అధికారులు తెలిపారు. ఘోష్ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ బంగాల్ విభాగాన్ని ఇటీవల కోరింది.
సోదరి సాధించిన విజయం
ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 7న మెడికల్ కౌన్సిల్ ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సభ్యత్వాన్ని ఎందుకు రద్దు చేయకూడదో మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించగా మాజీ ప్రిన్సిపల్ నుంచి స్పందన రాకపోవడంతో వేటు పడినట్లు తెలుస్తోంది. సందీప్ ఘోష్ మెడికల్ రిజిస్ట్రేషన్ రద్దు చేయడంపై జూనియర్ వైద్యులు స్పందించారు. ఇది మరణించిన తమ సోదరి సాధించిన విజయంగా అభివర్ణించారు. ఘోష్ అరెస్టైన మరుసటి రోజే అతని మెడికల్ రిజిస్ట్రేషన్ రద్దు కావాల్సి ఉందన్న జూనియర్ వైద్యులు ఎట్టకేలకు పశ్చిమ బంగాల్ మెడికల్ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు.
ఆర్జీ కర్ ఆసుపత్రిలోని సెమినార్ రూమ్‌లో ఆగస్టు 9న పీజీ వైద్య విద్యార్థి విగత జీవిగా కనిపించింది. తొలుత ఆత్మహత్య చేసుకుందని అధికారులు చెప్పినప్పటికీ దర్యాప్తులో హత్యాచారమని తేలింది. ఈ కేసులో పోలీసు వాలంటీర్‌గా పనిచేస్తున్న సంజయ్‌రాయ్‌ను పోలీసులు ఘటన జరిగిన మరుసటి రోజు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో సందీప్ ఘోష్ అవినీతి వ్యవహారం వెలుగుచూసింది. వైద్య కళాశాలలో ఆర్థిక అవకతవకలకు పాల్పడిన కేసులో సీబీఐ ఆయన్ను అదుపులోకి తీసుకుంది. ఘోష్‌కు నిర్వహించిన పాలిగ్రాఫ్ పరీక్ష, లేయర్డ్ వాయిస్ అనాలసిస్‌లో కీలక ప్రశ్నలకు మోసపూరిత సమాధానాలు ఇచ్చినట్లు తేలింది. సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ ఈ మేరకు నివేదిక ఇచ్చినట్లు దర్యాప్తు సంస్థ అధికారులు తెలిపారు.
మరోవైపు, కోల్‌కతా ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో దారుణ హత్యకు గురైన జూనియర్ వైద్యురాలి కాల్ రికార్డులను, సీసీటీవీ దృశ్యాలను భద్రపరచాలని ఆమె తండ్రి CBIకు లేఖ రాశారు. తన కుమార్తె హత్యకు గురికావడానికి కొన్ని గంటల ముందు ఆమెతో ఫోన్‌లో మాట్లాడినట్లు ఆయన ఆ లేఖలో ప్రస్తావించారు. హత్యాచార ఘటనపై తాము రూపొందించిన నివేదికతో పాటు మృతురాలి తండ్రి రాసిన ఆ లేఖను సైతం సెప్టెంబర్ 17న జరిగిన విచారణలో సుప్రీంకోర్టు ముందు ఉంచినట్లు CBI అధికారి తెలిపారు. ఆ రెండు పేజీల లేఖలో తన కుమార్తె హత్యకేసు విచారణ తీరుపై ఆయన ఆందోళ వ్యక్తం చేసినట్లు చెప్పారు. మృతదేహాన్ని గుర్తించిన సెమినార్ హాల్ సీసీటీవీ ఫుటేజ్‌ను జాగ్రత్తగా భద్రపరచాలని ఆ లేఖలో అభ్యర్థించినట్లు పేర్కొన్నారు. ఆగస్టు 9 తెల్లవారుజామున జరిగిన హత్యాచార ఘటనలో ఆస్పత్రి విధుల్లో ఉన్న పలువురు ఇంటర్న్‌లు, వైద్యుల ప్రమేయం ఉన్నట్లు మృతురాలి తల్లిందండ్రులు ఆరోపించారు. హత్యలో వారి పాత్రను గుర్తించడానికి తన కుమార్తెతో పాటు ఆ సమయంలో విధుల్లో ఉన్నవారి వివరాలను డ్యూటీ చార్ట్ ద్వారా తెలుసుకొని విచారించాలని లేఖలో కోరినట్లు CBI అధికారి చెప్పారు.