SC On NEET Row :దేశంలో వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష 2024 కౌన్సెలింగ్ ప్రక్రియను వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. నీట్ పరీక్ష వ్యవహారంపై దర్యాప్తు జరిపించి, ఆ పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని కోరుతూ దాఖలైన కొత్త పిటిషన్లపై జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ ఎస్‌వీఎన్ భట్టీలతో కూడిన వెకేషన్ బెంచ్ శుక్రవారం విచారించింది. వీటిపై దాఖలైన పిటిషన్లను జులై 8 నుంచి విచారించనున్నందున, జులై మొదటి వారంలో మొదలు కానున్న కౌన్సెలింగ్‌ను వాయిదా వేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరారు.
"నేను కౌన్సెలింగ్‌పై ఎలాంటి స్టే కోరడం లేదు. జులై 6న జరగాల్సిన కౌన్సెలింగ్‌ను రెండు రోజులు మాత్రమే వాయిదా వేయమని అడుగుతున్నా. అది కూడా జులై 8న విచారణ జరగడమే కారణం" అని న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే, కౌన్సెలింగ్ అనేది ఓపెన్ అండ్ షట్ ప్రక్రియ కాదని, జులై 6న కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందని ధర్మాసనం చెప్పింది. మొదటి రౌండ్ కౌన్సెలింగ్ వ్యవధి గురించి ధర్మాసనం ప్రశ్నించగా, ఇది ఒక వారం పాటు కొనసాగుతుందని న్యాయవాది చెప్పారు.
NTAకు కొన్ని ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను కూడా వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టింది. జూన్ 23వ తేదీన జరగనున్న రీ-టెస్ట్ విషయాన్ని పిటిషనర్ తరఫు న్యాయవాది లేవనెత్తారు. రీ-టెస్ట్‌పై స్టే విధించాలని కోరారు. అభ్యర్థులు మళ్లీ పరీక్షకు హాజరుకావాల్సి వస్తే ఒత్తిడికి లోనవాల్సి ఉంటుందని కోర్టుకు తెలిపారు. NTA కొంత సమాచారాన్ని దాచిపెట్టిందని ఆరోపించారు. "ఇప్పుడు ఏమీ జరగదు. మే 5 జరిగిన పరీక్షను పక్కన పెట్టే అవకాశం ఉన్నప్పుడు, 1,563 మంది అభ్యర్థులకు మాత్రమే జరగబోయే రీటెస్ట్ కోసం ఎందుకు ప్రశ్న?" అని బెంచ్ ప్రశ్నించింది. దీంతో ధర్మాసనం ఎన్టీఏ తరపు న్యాయవాదిని ఆ పిటిషన్‌పై స్పందనను దాఖలు చేయాల్సిందిగా ఆదేశించింది. తదుపరి విచారణను జులై 8కి వాయిదా వేసింది.
మేఘాలయలోని ఓ పరీక్ష కేంద్రంలో నీట్‌కు హాజరైన అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్‌పై కేంద్రంతోపాటు ఎన్‌టీఏకు సుప్రీం కోర్టు నోటీసులు జారీచేసింది. పరీక్ష సమయంలో తాము 45 నిమిషాలు నష్టపోయామని, గ్రేస్ మార్కులు పొందిన 1563 అభ్యర్థుల జాబితాలో తమను చేర్చి జూన్ 23న నిర్వహిస్తున్న పరీక్షకు అవకాశం కల్పించాలని కోరారు. అనారోగ్యంతో బాధపడుతున్న అభ్యర్థిని మళ్లీ పరీక్షకు హాజరయ్యేందుకు అనుమతించేలా ఎన్‌టీఏను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను కూడా సుప్రీంకోర్టు విచారించింది. ఎన్‌టీఏకు నోటీసులు జారీ చేసింది.