Chirag Paswan Oppose SC Sub-Classification Verdict :ఎస్సీ రిజర్వేషన్లను ఉపవర్గీకరించేందుకు రాష్ట్రాలకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై ‘లోక్ జనశక్తి పార్టీ’ (రాంవిలాస్) అదే కోర్టులో అప్పీలు చేయనుందని ఆ పార్టీ నేత, కేంద్ర మంత్రి చిరాగ్ పాసవాన్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ ఉప వర్గీకరణను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు.
"అంటరానితనం వల్ల బాధితులుగా మిగిలిన అణగారిన వర్గాలను పైకి తీసుకువచ్చేందుకు ఎస్సీ కోటాను ప్రవేశపెట్టారు. ఉప వర్గీకరణ వల్ల అసలు ప్రయోజనం నెరవేరకుండా పోతుంది. అంటరానితనం అనే పదాన్ని కోర్టు తీర్పులో ఎక్కడా ప్రస్తావించకపోవడం ఆశ్చర్యంగా ఉంది. చదువుకునే అవకాశం అందుబాటులో ఉన్న సంపన్నవంతులైన దళితులు సహా, ఎస్సీల్లో అత్యధికులు అంటరానితనాన్ని ఎదుర్కొంటున్నారు. ఉపవర్గీకరణను అనుమతించడం న్యాయసమ్మతం కాదు" అని చిరాగ్ పాసవాన్ అన్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాల్సిన అవసరం ఉందని, ఆ వివరాలను బహిర్గతం చేయనక్కర్లేదని ఆయన చెప్పారు. దళితుల కోటాలో క్రిమీలేయర్‌ను కూడా తాము వ్యతిరేకిస్తున్నామన్నారు.
క్రిమీలేయర్‌ను వ్యతిరేకిస్తాం : అఠావలె
దళితులకు క్రిమీలేయర్ నిబంధనను వర్తింపజేసేలా ఎలాంటి ప్రయత్నం జరిగినా, దానిని అడ్డుకుంటామని కేంద్రమంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు రాందాస్ అఠావలె స్పష్టం చేశారు. ఎస్సీల రిజర్వేషన్ల వర్గీకరణ వల్ల వారిలో అత్యంత వెనుకబడి ఉన్నవారికి న్యాయం జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. ఇతర కేటగిరీలవారికీ ఇలాంటిది జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.