NDA Seat Sharing In Bihar :బిహార్‌లో లోక్‌సభ ఎన్నికల కోసం ఎన్డీఏ కూటమి సీట్ల పంపకం పూర్తి అయ్యింది. ఈ మేరకు బీజేపీ బిహార్ ఇన్‌ఛార్జ్ వినోద్ తావ్‌డే ప్రకటించారు. మెుత్తం 40 లోక్‌సభ సీట్లు ఉన్న బిహార్‌లో 17 స్థానాల్లో బీజేపీ పోటీ చేయనుంది. నీతీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ 16 స్థానాల్లో పోటీ చేయనుంది. దివంగత రాంవిలాస్ పాసవాన్ కుమారుడు చిరాగ్ పాసవాన్కు చెందిన లోక్ జనశక్తి- రాంవిలాస్ పార్టీ ఐదు స్థానాల్లో బరిలోకి దిగనుంది. రాష్ట్రీయ లోక్ సమతా పార్టీకి చెందిన ఉపేంద్ర కుష్వాహా, హిందుస్థానీ అవామ్ మోర్చా చెరో సీటులో పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాసవాన్ హాజీపుర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ చీఫ్ రాజ్ తివారీ తెలిపారు. మిగిలిన స్థానాలకు అభ్యర్థులను త్వరలోనే ప్రకటిస్తామని కూటమిలోని పార్టీలు వెల్లడించాయి.
అయితే తాజా సీట్ల సర్దుబాటు వల్ల మొదటిసారి బీజేపీ, జేడీయూ కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తున్నట్లైంది. 2019లో ఈ రెండు పార్టీలు చెరో 17 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపాయి. ఇక అప్పుడు ఒకటిగా ఉన్న రాం విలాస్ పాసవాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి ఆరు స్థానాల్లో పోటీ పడింది. బీజేపీ, ఎల్జేపీ తాము పోటీ చేసిన అన్ని సీట్లు గెలవగా, జేడీయూ 18 స్థానాల్లో విజయం సాధించింది. ఇదిలా ఉండగా, సీట్ల పంపకం వివరాలు తెలియజేసిన వినోద్ తావ్‌డే, ఈ లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లో మొత్తం 40 స్థానాల్లో ఎన్డీఏ అభ్యర్థులు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.