NDA Alliance Chandrababu Nitish :కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, జేడీయూ అగ్రనేత నీతీశ్‌కుమార్ కింగ్ మేకర్స్‌గా మారారు. 2024 ఎన్నికల్లో సొంతంగా 272 మెజార్టీ మార్కును బీజేపీ దాటకపోవడం వల్ల కూటమిలో అతిపెద్ద పార్టీలైన తెదేపా, జేడీయూలపై ఆధారపడక తప్పని పరిస్థితి నెలకొంది. ఇది రాజకీయంగా ఆంధ్రప్రదేశ్‌కు మేలుచేసే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
అయితే చంద్రబాబు, నీతీశ్ గతంలో ఎన్డీయే భాగస్వాములుగా ఉన్నా రాజకీయ వైరుద్ధ్యాల కారణంగా బయటికి వచ్చి ఈసారి ఎన్నికలకు ముందే తిరిగి కలిశారు. బిహార్‌లో బీజేపీ పెద్దన్న పాత్ర అయితే ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ఆ స్థానంలో ఉంది. అయినప్పటికీ పరస్పర అవగాహనతో ఆయా పార్టీలకు స్థానికంగా ఉన్న బలాబలాల ఆధారంగా సీట్లు సర్దుబాటు చేసుకొని బరిలో దిగాయి. దీనివల్ల ఆంధ్రప్రదేశ్‌లో తెదేపా, బీజేపీ రెండు కూడా లాభపడగా, బిహార్‌లోనూ అదే పరిస్థితి.
ప్రస్తుతం ఎన్డీయేలో బీజేపీ తర్వాత అతి పెద్ద పార్టీలుగా 16 సీట్లతో తెలుగుదేశం, 12 సీట్లతో జేడీయూ నిలిచాయి. భవిష్యత్తులో కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వం సుస్థిరంగా సాగాలంటే వీరి మద్దతు కచ్చితంగా అవసరం. ఈ రాజకీయ బలాన్ని ఉపయోగించుకొని వారు తమ సొంత రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ పరంగా మేలు చేసుకొనే అవకాశం ఏర్పడుతుంది.
వాజ్‌పేయీ టైమ్‌లో కూడా!
1999లో వాజ్‌పేయీ నేతృత్వంలో తొలిసారి ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వంలోనూ చంద్రబాబునాయుడు కీలకపాత్ర పోషించారు. ఆ సమయంలో ఆయన తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి హైదరాబాద్‌కు అంతర్జాతీయ విమానాశ్రయం, ఎంఎంటీస్, హైవేలు తీసుకురాగలిగారు. గత ఐదేళ్ల జగన్ పాలనలో అభివృద్ధికి దూరమైన ఆంధ్రప్రదేశ్‌ను సరిదిద్దడానికి, పోలవరం, అమరావతిలాంటి ప్రాజెక్టులు పూర్తిచేయడానికి ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు చంద్రబాబునాయుడికి ఉపయోగపడే అవకాశం ఉంది. తన రాజకీయ అనుభవం, ప్రస్తుతం కేంద్రంలో ఉన్న పరిస్థితులను ఆలంబనగా చేసుకొని ఉన్న ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసి, కొత్త వాటిని రాష్ట్రానికి తీసుకురావడానికి ఎక్కువ అవకాశాలుంటాయని రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు.