Haryana CM Oath Ceremony :హరియాణాలో వరుసగా మూడోసారి బీజేపీ ప్రభుత్వం కొలువుతీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారి నాయబ్ సింగ్ సైనీ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. పంచకులలో రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.
నాయబ్ సింగ్ సైనీతో పాటు 13 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమం అనంతరం సైనీ, మంత్రులుగా ప్రమాణ చేసిన వారితో కలిసి ప్రధాని మోదీ ఫొటో దిగారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు నాయబ్ సింగ్ సైనీ పంచకులలోని వాల్మీకి, మాసన దేవీ ఆలయంలో పూజాలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ నాయత్వంలో గత 10 ఏళ్లుగా బీజేపీ ప్రభుత్వం సమవర్ధవంతగా పని చేసిందన్నారు. మళ్లీ అదే ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న కాలంలో మేము ప్రధానితో కలిసి పని చేసి హరియాణాను ముందుకు తీసుకెళ్లేందుకు సిద్దంగా ఉన్నామని పేర్కొన్నారు.
ప్రమాణ స్వీకారాన్ని నిలిపివేయాలని సుప్రీం కోర్టులో పిటిషన్
అంతకుముందు, సీఎం ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమాన్ని నిలిపివేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. గురువారం ఉదయం దీనిపై అత్యవసర విచారణ జరపాలని పిటిషనర్ కోరారు. అయితే ఆ అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. ప్రమాణస్వీకారంపై స్టే విధించేందుకు నిరాకరించింది. ఎన్నికైన ప్రభుత్వాన్ని ప్రమాణ స్వీకారం చేయకుండా ఎలా అడ్డుకోగలమని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. ఇలాంటి పిటిషన్ వేసినందుకు జరిమానా విధిస్తామని హెచ్చరించింది. పిటిషన్ కాపీలను ముగ్గురు న్యాయమూర్తులకు అందిస్తే పరిశీలిస్తామని న్యాయస్థానం తెలిపింది.
ఇటీవల జరిగిన హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తారుమారు చేస్తూ బీజేపీ హ్యాట్రిక్ కొట్టింది. మొత్తం 90 స్థానాల్లో బీజేపీ 48 సీట్లు, కాంగ్రెస్ 37 నియోజకవర్గాల్లో గెలుపొందింది. పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకొచ్చిన నాయబ్ సింగ్ సైనీకే అధిష్ఠానం మొగ్గు చూపుంది. బుధవారం జరిగిన బీజేపీ శాసనసభ పక్ష సమావేశంలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్, సీనియర్ నేత అనిల్ విజ్ ఆయన పేరును ప్రతిపాదించగా సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. దీంతో రెండోసారి హరియాణా సీఎంగా రెండో సారి బాధ్యతలు చేపట్టారు. ఇక ఈ ఏడాది మార్చిలోనే మనోహర్‌లాల్ ఖట్టర్ స్థానంలో నాయబ్ సింగ్ సైనీకి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.