Narendra Modi Ayodhya Ram Mandir: రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ తర్వాత ప్రధాని మోదీ ప్రసంగించనున్న వేదిక ప్రస్తుతం చర్చనీయాంశమైంది. 1992 రామమందిర ఉద్యమ సమయంలో ఉద్యమకారులు 'రామ్‌లల్లా మేము వచ్చాం', 'ఇక్కడే నీకు గుడి కడతాం' అని ప్రతిజ్ఞ చేశారు. ఇప్పుడు ప్రధాని మోదీ ప్రసంగానికి అదే వేదిక ఎంపిక చేయడం గమనార్హం.
Ayodhya Ram Mandir Chief Guest List :అయోధ్య రామ మందిర ప్రారంభ మహోత్సవానికి హజరయ్యేందుకు అతిరథ మహారథులు పవిత్ర నగరానికి చేరుకున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధినేత మోహన్ భగవత్ , కేంద్రమంత్రి స్మృతి ఇరానీ, సినీ నటులు రజినీకాంత్, అలియా భట్, రణబీర్‌కపూర్, జాకీ ష్రాఫ్, మాధురీ దీక్షిత్, కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ దంపతులు, అనుపమ్ ఖేర్, కైలాష్ ఖేర్, హేమమాలిని ఇప్పటికే అయోధ్య రామాలయానికి విచ్చేశారు. అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ కూడా అయోధ్య ఆలయానికి చేరుకున్నారు.
నటి కంగనా రనౌత్ , వివేక్ ఒబెరాయ్ రామజన్మ స్థలానికి చేరుకున్నారు. ప్రముఖ గాయకుడు శంకర్ మహాదేవన్ , మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే, బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ , యోగా గురు బాబా రాందేవ్ అయోధ్య వచ్చారు. మాజీ ప్రధానమంత్రి హెచ్.డి. దేవేగౌడ అయోధ్య రామలయానికి చేరుకున్నారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి 7వేలమందిని ఆహ్వానించగా అందులో 506మంది లిస్ట్ -ఏలో ఉన్నారు. ఇందులో ప్రముఖ రాజకీయ నేతలతోపాటు దిగ్గజ పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు, దౌత్యవేత్తలు, న్యాయమూర్తులు, పూజారులు ఉన్నారు.
'శ్రీరాముడు మతానికి అతీతుడు'
శ్రీరాముడు మతానికి అతీతుడని వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర అన్నారు. మత విశ్వాశాలు ఏవైనా గౌరవం, బలమైన విలువలతో జీవించడానికి అంకితమైన మహావ్యక్తి రాముడు అనే భావనకు ఆకర్షితులవుతామని తెలిపారు. రాముడి బాణాలు చెడు, అన్యాయాన్ని లక్ష్యంగా చేసుకున్నాయని చెప్పారు. రామరాజ్యం అనే ఆదర్శపాలన భావన నేడు అన్ని సమాజాల ఆకాంక్ష అని మహీంద్ర అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం 'రామ్' అనే పదం యావత్ ప్రపంచానికి చెందినదని చెప్పారు.