Pushpa 2 Screening Break: అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో తెరకెక్కిన 'పుష్ప 2' సినిమా ప్రదర్శనకు ముంబయిలోని ఓ థియేటర్లో కాసేపు బ్రేక్ పడింది. థియేటర్లో గుర్తుతెలియని వ్యక్తి ఘాటైన స్ప్రే కొట్టడం వల్ల ప్రేక్షకులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో సినిమాకు 15-20 నిమిషాలు బ్రేక్ పడింది. కాసేపటి తర్వాత సినిమా మళ్లీ ప్రారంభమైంది.
ఇదీ జరిగింది
బాంద్రా గెలాక్సీ థియేటర్లో గురువారం రాత్రి సెకండ్ షో సమయంలో గుర్తుతెలియని వ్యక్తి హాలులో ఘాటైన స్ప్రే కొట్టాడు. ఇంటర్వెల్ టైమ్‌లో ఆడియెన్స్ బయటకు వెళ్లినప్పుడు అతడు ఈ పని చేశాడు. బ్రేక్ తర్వాత హాలులోకి వచ్చిన ప్రేక్షకులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విపరీతమైన దగ్గు, వాంతులు, శ్వాససంబంధ సమస్యలతో తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. దీంతో అప్రమత్తమైన థియేటర్ యాజమాన్యం సినిమాను కాసేపు నిలిపివేసి, పోలీసులకు సమాచారం అందించింది. థియేటర్‌కు చేరుకున్న పోలీసులు ప్రతి ఒక్కరినీ తనిఖీ చేశారు. ఆ తర్వాత 20 నిమిషాలకు తిరిగి షో ప్రారంభమైంది. అయితే ఈ స్ప్రే చల్లిన వ్యక్తి ఎవరో తెలియాల్సి ఉంది.
'ఇంటర్వెల్ టైమ్‌లో మేం బయటకు వెళ్లాం. తిరిగి హాలులోకి వచ్చే సరికి ఏదో స్ప్రే కొట్టినట్లు అనిపించింది. ఆ స్ప్రే వల్ల ప్రేక్షకులు దగ్గు, వాంతులు చేసుకున్నారు. దీంతో స్క్రీనింగ్ ఆగిపోయింది. పోలీసులు వచ్చి అందరినీ చెక్ చేశారు. ఆ తర్వాత షో మళ్లీ ప్రారంభమైంది' అని ఓ ప్రేక్షకులు తెలిపారు.