MVA Performance Maharashtra Polls : మహారాష్ట్రలో 'మహాయుతి' జోరుకు ప్రతిపక్షాలు కుదేలైపోయాయి. శివసేన, ఎన్సీపీ వర్గాల్లో ఏదీ అసలైన పార్టీయో ప్రజలు తేల్చేశారు. అలాగే సానుకూల ఫలితాలు వస్తాయని, తాము ప్రభుత్వ ఏర్పాటులో కీలకమవుతామనుకున్న పార్టీలు మహాయుతి సునామీకి కొట్టుకుపోయాయి.
శివసేన వర్సెస్ శివసేన(యూబీటీ)
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ శిందే నేతృత్వంలోనే శివసేన, ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేన(యూబీటీ) నేరుగా 50 స్థానాల్లో పోటీ పడ్డాయి. ఈ పోటీలో శిందేనే పై చేయి సాధించారు. ఆయన నేతృత్వంలోని శివసేన 36 స్థానాల్లో శివసేన(యూబీటీ)పై గెలుపొందింది. ఉద్ధవ్ శివసేన కేవలం 14 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది.
ఎన్సీపీ వర్సెస్ ఎన్సీపీ(ఎస్పీ)
శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ(ఎస్పీ)పై అజిత్ సారథ్యంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధించింది. ఈ రెండు పార్టీలు నేరుగా 35 స్థానాల్లో పోటీపడగా ఎన్సీపీ 29 చోట్ల, ఎన్సీపీ(ఎస్పీ) ఆరుచోట్ల మాత్రమే గెలుపొందింది.
మహాయుతి సునామీలో కొట్టుకుపోయిన పార్టీలు
మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో మహాయుతి ధాటికి రాజ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన, ప్రకాశ్ అంబేడ్కర్ వంచిత్ బహుజన్ అఘాడీ, బహుజన్ సమాజ్ పార్టీ బోణీ కొట్టలేక ఢీలా పడ్డాయి. అఖిలేశ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ 2, ఏఐఎంఐఎం పార్టీ ఒక సీటు దక్కించుకున్నాయి.
బహుజన్ సమాజ్ పార్టీ 237, ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్) 28, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన 125, వంచిత్ బహుజన్ అఘాడీ 200 మంది అభ్యర్థులను నిలబెట్టాయి. అయినప్పటికీ ఈ నాలుగు పార్టీలు ఎన్నికల ఫలితాల్లో బోణీ కొట్టలేకపోయాయి. స్వాభిమాన్ పక్ష్, ప్రహార్ జనశక్తి పార్టీ, రాష్ట్రీయ సమాజ్ పక్ష్, రాజశ్రీ సాహు వికాస్ అఘాడీ వంటి పార్టీలు పోటీ చేసినా ఎన్నికల ఫలితాల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి.
తక్కువ మెజార్టీల గెలుపులివే!
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు అభ్యర్థులు చాలా తక్కువ ఓట్ల తేడాతో విజయం సాధించారు. మాలెగావ్ సెంట్రల్ లో ఏఐఎంఐఎం అభ్యర్థి 162 ఓట్ల తేడాతో విజయం సాధించారు. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే సకోలి నుంచి 208 ఓట్లతో గెలుపొందారు.